Film Producer NV Prasad On Theatre Issues: మూసేసిన సినిమా థియేటర్లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వటం సంతోషకరమని నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ అన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన...తమ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని భావిస్తున్నామన్నారు. ఎగ్జిబిటర్లుగా తమ తప్పులు కొన్ని ఉన్నాయని.. అలాగే అన్ని పత్రాలు సమర్పించినా అధికారులు అనుమతి ఇవ్వని సందర్భాలూ ఉన్నాయన్నారు. ప్రభుత్వం తమకు మరింత సహకరించాలని ఆయన కోరారు.
తెలుగు సినిమాకు ఇప్పుడు దేశవ్యాప్త ఖ్యాతి ఉందని ఎన్వీ ప్రసాద్ అన్నారు. కరోనా అనంతరం డిసెంబరులోనే థియేటర్లు కాస్త కుదుటపడుతున్నాయని.., పెద్ద హీరోల సినిమాలు తగ్గిపోవటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. తెలుగు పరిశ్రమకు ఒక ఛాంబర్ చాలని... కావాల్సి వస్తే నట్టి కుమార్ మరో ఛాంబర్ ఏర్పాటు చేసుకోవచ్చనన్నారు. టిక్కెట్ ధరల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామన్నారు. నవరత్నాలతో పాటు సినీ పరిశ్రమను ముఖ్యమంత్రి కాపాడాలన్నారు.
సీజ్ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి..
రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో సీజ్ చేసిన 83 థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీని కోసం జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ)కు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవాలని పేర్ని నాని సూచించారు. ఆయా థియేటర్లు అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో జేసీకి దరఖాస్తు చేసుకుంటే తిరిగి అనుమతిస్తారని చెప్పారు.
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్ యజమానులు ఈ రోజు మంత్రి పేర్ని నానిని మచిలీపట్టణంలోని అయన కార్యాలయంలో కలిశారు. కొన్ని విషయాలు వ్యక్తిగతంగా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని నారాయణమూర్తి తెలిపారు.
ఇదీ చదవండి :
Cinema Theaters Open: సీజ్ చేసిన థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి