చిత్తూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తిరుపతి నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1300కు చేరింది. గడిచిన వారం రోజులుగా తిరుపతిలో పాజిటివ్ కేసులు వందకు పైబడి నమోదవుతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చిత్తూరు జిల్లాలో 330 కేసులు నమోదయినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.
జిల్లాలో నమోదైన 330 కేసుల్లో తిరుపతి నగరంలో 194 కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు మదనపల్లె, రేణిగుంట, పుత్తూరు, తిరుపతి గ్రామీణ ప్రాంతాలలోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తిరుపతి గ్రామీణంలో 29 కేసులు, మదనపల్లెలో 13 కేసులు, పుత్తూరులో 8 కేసులు, చిత్తూరు నగరంలో 11 కేసులు, నారాయణవనం 5 కేసులు, రేణిగుంటలో 7 కేసులు నమోదయ్యాయి.
తిరుపతి నగరంలో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణ ఆరోగ్య కేంద్ర సిబ్బందితో సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పల్స్ ఆక్సిమీటర్లను ఆరోగ్య కార్యకర్తలకు అందజేశారు. కేసులు ఎక్కువ నమోదవుతున్న వార్డులలో పర్యటించి వయస్సు పైబడిన వారి ఆరోగ్య పరిస్ధితులను సమీక్షించాలని ఆదేశించారు. ఆక్సిజన్ మోతాదు తక్కువ ఉన్నవారిని గుర్తించి నమూనాలు సేకరించాలని సూచించారు
ఇదీ చూడండి
వైద్య ఖర్చు వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ ...నేటి నుంచి ఆరు జిల్లాల్లో అమలు !