మామిడి చెట్లను ధ్వంసం చేసిన ఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి వెల్లడించారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నాగూర్ పల్లి వద్ద తెదేపా సానుభూతి పరులైన సుబ్రహ్మణ్యం రెడ్డి, ఢిల్లీ రాణి దంపతులకు చెందిన వ్యవసాయ పొలంలో పదేళ్ల క్రితం నాటిన మామిడి మొక్కలను స్థానిక వైకాపా నేతలు ధ్వంసం చేశారు. ఈ మేరకు బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.
తెదేపా సానుభూతిపరుల ఆస్తులపై దాడులకు పాల్పడిన నేతల వైఖరిని తప్పు పడుతూ... తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి లేఖ రాశారు. ఘటనపై స్పందించిన డీఎస్పీ ధ్వంసమైన మామిడి తోటను పరిశీలించారు.