కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేడీ శీలం మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాళహస్తిలో ప్రచారం నిర్వహించిన ఆయన..భాజపా పాలనలో భారత్ పేదరికం, ధనిక అనే రెండు దేశాలుగా ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఆరేళ్ల పాలనలో పేదరికంతో పాటు కుబేరుల సంఖ్య పెరిగిందన్నారు. జీఎస్టీల పేరుతో చిన్న వ్యాపారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. ఎన్నికల వేళ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి..ఉన్న ఉద్యోగాలను తొలగించే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు.
తిరుపతి రైల్వే డివిజన్ చేయాలని డిమాండ్ వినిపిస్తున్నా..ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా వాల్తేర్ రైల్వే డివిజన్ తొలగించారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని దైవసాక్షిగా ప్రమాణం చేసిన భాజపా.. ఇవ్వకుండా దేవుణ్ణి మోసం చేసిందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా ఇస్తానన్న జగన్.. భాజపాకు భయపడి హోదా విషయం మరిచారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పరిశ్రమలు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన్నవరం, దుగరాజపట్నం పోర్టు, తిరుపతి శ్రీకాళహస్తి మధ్యలో ఇంటర్నేనేషనల్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు.
ఇదీచదవండి