Cattle Festival: చిత్తూరు జిల్లా కొత్త శానంబట్ల గ్రామంలో పశువుల పండుగ కోలహాలంగా నిర్వహించారు. సంక్రాంతికి ముందు పశువుల పండగ నిర్వహించటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని పశువులే కాకుండా.. చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు సైతం తమ పశువులను పండుగ కోసం తీసుకువచ్చారు.
ఈ పండుగలో పశువుల కొమ్ములకు తమ ఇష్టదైవాలతోపాటు సినీ హీరోల ఫొటోలతో కూడిన చెక్క పలకలను అలంకరించారు. అనంతరం వాటితో పరుగులు పెట్టించారు. ఆ తర్వాత గ్రామ వీధుల్లో పరుగులు పెట్టే పశువుల కొమ్ములకు ఉన్న చెక్క పలకలను చేజిక్కించుకోవటానికి యువకులు పోటీపడ్డారు.
పశువుల పండుగను వీక్షించేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు భావితరాలకు తెలియజేయాలనే లక్ష్యంతోనే.. ఈ పోటీలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కాగా.. ఈ పోటీల్లో నలుగురు గాయపడ్డారు. వారిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
"ఇది మా పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం. పశువులను అందంగా అలంకరించి బరిలోకి దింపుతాం. పశువులకు పలకలు కట్టి గ్రామ వీధుల్లో వదులుతాం. పశువులకు కట్టిన పలకలను చేజిక్కించుకునేందుకు యువకులు పోటీ పడతారు. మా పశువులకు కట్టిన పలకలను వారు సాధిస్తే.. మా సిరి సంపదలు వారికి వెళ్లిపోతాయని విశ్వసిస్తాం. అలా కాకుండా మా పశువులు పలకలతో సహా తిరిగొస్తే మా సిరి సంపదలు మాతోనే ఉంటాయని నమ్ముతాం. ఈ పోటీలో పాల్గొనటానికి పెద్ద ఎత్తున రైతులు తరలివస్తారు." - స్థానికుడు
ఇదీ చదవండి