కరోనా కారణంగా రక్తదాన శిబిరాలు నిండుకున్నాయి. ఒకవేళ ఎవరైనా దాతలు ముందుకొచ్చి రక్తం ఇవ్వాలన్నా రెడ్ జోన్లో ఉండటంతో ఆటంకం ఏర్పడుతుంది. చిత్తూరు జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
- చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ గర్భిణి (24) తొలి కాన్పు నిమిత్తం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు రక్తంలో హిమోగ్లోబిన్ 7.5 శాతం మాత్రమే ఉన్నట్లు రక్తపరీక్షల్లో వెల్లడైంది. ఏ పాజిటివ్ రక్తం కావాలని జిల్లా ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఆ వర్గం రక్తం లేకపోవడంతో దాతలను పిలిపించారు. కొవిడ్ కారణంగా దాత రెడ్‌జోన్ ప్రాంతంలో ఉండటం వల్ల అతని వద్ద నుంచి రక్తం తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
- కురబలకోట మండలంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి బి పాజిటివ్ రక్తం అవసరం కావటంతో ఆసుపత్రిలో ఉన్న బాధితుడికి చెందిన ఒకే ఒక్కరక్తం ప్యాకెట్ ఎక్కించారు. మరో ప్యాకెట్ కోసం పరుగులు తీశారు.
- కరోనా నేపథ్యంలో రక్తదానం చేసేందుకు దాతలు, ప్రజలు ముందుకు రావటం లేదు. వ్యాధి భయంతో వెనకడుగు వేస్తున్నారు. అవసరం అయిన వారు ప్రైవేటు రక్తనిధి కేంద్రాల్లో వేలకు వేలు డబ్బు పోసి రక్తం కొనుగోలు చేయాల్సి వస్తోంది. రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
- ఎక్కడా ఎలాంటి రక్తదాన శిబిరాలు పెట్టటం లేదు. దాతలు ఒకరిద్దరు ముందుకొచ్చి ఇస్తున్నా... అది ఏ మాత్రం సరిపోవడం లేదు. చైతన్య కార్యక్రమాలు పూర్తిగా తగ్గాయి.
- జిల్లాలో మదనపల్లె, తిరుపతి రుయా, తిరుపతి స్విమ్స్, చిత్తూరులో రక్తనిధి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. పలమనేరు, పుంగనూరు, కుప్పం, వీకోట, పీలేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, నగరి ప్రాంతాల్లో రక్త నిల్వ కేంద్రాలు ఉన్నాయి. రక్తనిధి కేంద్రాల ద్వారా రక్తం సేకరించి జిల్లావ్యాప్తంగా ఉన్న స్టోరేజీ కేంద్రాలకు తరలిస్తారు.
- రక్తం తీసుకున్న వారి బంధువులను రీప్లేస్ ఇవ్వాలని అడగాలన్నా సిబ్బంది కొవిడ్ కారణంగా భయపడుతున్నారు. యూనివర్సల్ గ్రూపులకు ఇబ్బంది లేకున్నా... కొన్ని రక్త వర్గాలు అందుబాటులో లేక ప్రాణాలు పోతున్నాయి.
ప్లాస్మా ఇవ్వండి
కొవిడ్ బారిన పడి ఆరోగ్యంగా బయటపడిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా అందిస్తే కరోనా వచ్చిన వ్యక్తిని ప్లాస్మా థెరపీ ద్వారా ఆరోగ్య వంతులను చేయవచ్చు. డిశ్ఛార్జి అయిన వారు ముందుకు వస్తే ఉపయోగంగా ఉంటుందని హెల్పింగ్ మైండ్స్ రక్తదాతల సంఘం వ్యవస్థాపకుడు అబుబకర్ సిద్ధిక్ తెలిపారు.
ఇదీ చూడండి