తితిదే పరిధిలోని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో కరోనా కేసులకు చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు. రాయలసీమ జిల్లాల్లోని పేద ప్రజలకు హృద్రోగ, మూత్రపిండ, నరాల(న్యూరాలజీ) విభాగాల్లో మెరుగైన సేవలు అందించడం ద్వారా గుర్తింపు పొందిన స్విమ్స్ ఆసుపత్రిలో సాధారణ ఓపీ సేవలను తగ్గించేశారు. అత్యవసరమైతే తప్ప ఇతర రోగాల బాధితులు ఆసుపత్రికి రావద్దంటూ స్విమ్స్ యాజమాన్యం సంక్షిప్త సందేశాల పంపుతోంది.
కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం... చిత్తూరుతో పాటు ఇతర జిల్లాల నుంచి వైరస్ బాధితులు వస్తున్నందున ఆసుపత్రికి రోగుల తాకిడి ఎక్కువైంది. స్విమ్స్‌ను రాష్ట్ర కొవిడ్ ఆసుపత్రిగా ప్రకటించినప్పటి నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 550 మంది కరోనా బాధితులకు చికిత్స అందించారు. ఇక్కడ చేరిన వారిలో 26 మంది మృతిచెందగా... 240 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు.
స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న 350 పడకల్లో దాదాపు 300 వరకు రోగులతో నిండిపోయాయి. గడిచిన వారం రోజుల్లో కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసుల శాతం పెరగటంతో మరిన్ని బెడ్లు అవసరమని భావించిన ప్రభుత్వం అదనంగా 100 పడకల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. వివిధ రోగాల చికిత్స కోసం స్విమ్స్ ఆసుపత్రికి సగటున రోజుకు 1200 మంది ఔట్ పేషెంట్లు వస్తుండగా వారి సంఖ్యను 400కు పరిమితం చేసింది. ఔట్ పేషెంట్ల సంఖ్య తగ్గించడం ద్వారా.. ఆ సిబ్బందిని కొవిడ్ రోగుల సేవలకు వినియోగించనున్నారు. హృద్రోగం, మూత్రపిండ వ్యాధులకు సంబంధించి అత్యవరమైతే తప్ప ఆసుపత్రికి రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు స్విమ్స్ సంచాలకులు వెంగమ్మ తెలిపారు.
స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అనంతపురం జిల్లా నుంచి 53 మంది, కడప జిల్లా నుంచి 83, చిత్తూరు జిల్లా నుంచి 333 మంది ఉన్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కడప జిల్లా నుంచి ముగ్గురు, చిత్తూరు జిల్లాకు చెందిన 18 మంది, అనంతపురం, ప్రకాశం, కర్నూలు జిల్లాల నుంచి ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి...