జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విజయవాడ బిషప్ అజరయ్య పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటామని విద్యార్థులతో డీఈవో రాజ్యలక్ష్మి ప్రతిజ్ఞ చేయించారు. ఎన్నికల కమిషన్ సూచనలతో వక్తృత్వ పోటీలు నిర్వహించినట్టు రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొంది, రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన విద్యార్థులను ఆమె అభినందించారు. ఈ విజేతలకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ చేతులు మీదుగా బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని టీఎన్ వెంకటసుబ్బారెడ్డి ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన యువత ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని స్థానిక తహసీల్దార్ రవీంద్రారెడ్డి విద్యార్థులకు సూచించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో 'ఈనాడు-ఈటీవీభారత్' ఆధ్వరంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. తారక రామాపురం డిగ్రీ కళాశాల నుంచి కొత్తపేట కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి నేతలను ఎన్నుకోగలరని అధికారులు వివరించారు.
ఇదీ చదవండి:71వ 'రిపబ్లిక్ డే'కు 71వేల టూత్పిక్లతో త్రివర్ణ పతాకం