అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ మేరకు పురపాలక సంఘ కమిషనర్‌తో పాటు ఆయా మండలాల తహసీల్దార్లు పట్టాలు సిద్ధం చేశారు. అయితే స్థలాల ఎంపిక పట్ల పలువురు లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు లబ్ధిదారులను బుజ్జగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
- చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధిలో 5,794 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఇందులో 1,994 రాజీవ్‌నగర్‌లోను, మిగిలిన 3,800 మందికి ఊరందూరు రెవెన్యూ పరిధిలో పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. పట్టణానికి చెందిన వాళ్లు ఊరందూరు రెవెన్యూ పరిధిలోనికి వెళ్లేందుకు కాస్తంత అనాసక్తి చూపుతున్నారు.
- శ్రీకాళహస్తి మండలంలో అర్హులైన 1424 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. వీరందరికీ ఊరందూరు రెవెన్యూ పరిధిలోని విష్ణు కెమికల్స్ సమీపంలో పట్టాలు పంపిణీ చేస్తున్నారు. పట్టణంతో పాటు ఇతర మండలాల వాళ్లకు ఇక్కడ పట్టాలు పంపిణీ చేయడంపట్ల కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే మరికొందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
- తొట్టంబేడు మండలంలో 1488 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. వీరిలో చాలా మందికి తొట్టంబేడు బీసీ కాలనీలో పట్టాలు ఇస్తున్నారు. అడుసునేల కావడం, వర్షం వస్తే బురదమయంగా మారుతుండటంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఏర్పేడు మండలంలోని ఇళ్ల స్థలాల పంపిణీకి మొదటి, రెండు విడతల్లో 2539 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి శ్రీకాళహస్తి మండలంలోని ఊరందూరు రెవెన్యూలో పట్టాలు పంపిణీ చేస్తున్నారు. వీళ్ల నివాసాలకు ఇక్కడి ప్రదేశం దూరం కావడం, ఊర్లు వదులుకుని రావాల్సి ఉండటంతో లబ్ధిదారుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
- రేణిగుంటలో మొదటి, రెండో విడతలో 9 వేల మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నారు. మొదటి విడతలో 3 వేలు కాగా, రెండో విడతలో ఒక్కసారిగా పెరగడం పట్ల అక్కడి స్థానికుల్లోనే విమర్శలు తలెత్తుతున్నాయి. కొంత ప్రభుత్వ స్థలంతో పాటు మరింత ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారు.
పంపిణీకి సిద్ధం
లబ్ధిదారులకు విలువైన ఇళ్ల పట్టాలను ఈ నెల 25వ తేదీన అందుబాటులో ఉంచేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పట్టణంలోని కొందరికి రాజీవ్‌నగర్‌లో ఇస్తున్నాం. ఊరందూరు రెవెన్యూ దగ్గరగా ఉన్న వాళ్లకు అక్కడ పట్టాలిస్తున్నాం. - సీ.హెచ్.శ్రీనివాస్, కమిషనర్, శ్రీకాళహస్తి
ఇవీ చదవండి: