తిరుపతిలో అంతర విశ్వవిద్యాలయాల క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీ వెటర్నరీ విశ్వవిద్యాలయ వేదికగా 5రోజుల పాటు జరగనున్న అగ్రిస్పోర్ట్స్-2020ను భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి ఉపసంచాలకుడు ఆర్సీ అగర్వాల్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 65 వ్యవసాయ, పశువైద్య విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 2వేల 800 మంది విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు. సుమారు 17 క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక పరేడ్... క్రీడా సంబరాల్లో విశేషంగా ఆకట్టుకుంది.
తొలిరోజు బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర క్రీడాంశాల్లో ప్రాథమిక స్థాయి పోటీలను నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన విద్యార్థుల కోసం వర్సిటీ అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర జంతువు కృష్ణజింకను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ.... మైదానంలో ఏర్పాటు చేసిన మస్కట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
అధికారులు చేసిన ఏర్పాట్లపై విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. నిత్యం చదువుల ఒత్తిడిలో ఉండే తమకు ఈ క్రీడాసంబరాలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.