ఎటు చూసిన పచ్చదనం... మిగిలిన ప్రాంతాల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు... అరుదైన వృక్షజాతులతో నిండిన అటవీ...ఇలా ఎన్నో సహజ సిద్ధమైన ప్రకృతి సౌందర్యాలకు తోడు కలియుగ వైకుంఠనాథుడు కొలువైన క్షేత్రం....తిరుమల. ఏడు కొండల వాడిని దర్శించుకొనే భక్తులతో పాటు.. ప్రకృతి అందాలకు ముగ్దులైన పర్యాటకులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు.
గతంలో తిరుమల వాతావరణం... ప్రస్తుత పరిస్థితులపై భక్తులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సమస్యలతో ఆపదమొక్కులవాడిని దర్శించుకొనేందుకు వచ్చే తమకు ఆధ్యాత్మిక చింతనతో పాటు తిరుమల ఆహ్లాదకరమైన వాతావరణం శారీరక బడలికను దూరం చేసేదని... ఇప్పుడా వాతావరణం లేదంటున్నారు భక్తులు.
పెరుగుతున్న భక్తులతోపాటే... వారి రాకపోకల కోసం వినియోగించే వాహనాలు అంతే స్థాయిలో పెరిగిపోయాయి. ఫలితంగా తిరుమల వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గాలిలో ఉండాల్సిన స్థాయి కంటే నైట్రోజన్ ఆక్సైడ్ శాతం పెరిగిపోయింది. వాయు నాణ్యతను పరిశీలించే ఏడు అంశాల్లో.. రెండు అంశాలు సాధారణ స్థాయికి మించడంతో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కాలుష్య నియంత్రణ మండలి తితిదేకు నోటీసులు జారీ చేసింది. తిరుమలకు వెళ్లే వాహనాలకు కాలుష్య నియంత్రణ తనిఖీలు చేపట్టారు. 15 సంవత్సరాలు పైబడి....కాలుష్యం కారకాలు అధికంగా వెదజల్లే వాహనాలను తిరుమలకు వెళ్లకుండా నిషేదించారు.
మరో వైపు తితిదే తమ పరిపాలనపరమైన అవసరాల కోసం వినియోగించే వాహనాలను విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు చర్యలు చేపట్టింది. భక్తులను తిరుమలకు చేరవేసే ఆర్టీసీ బస్సులను సైతం విద్యుత్ వాహనాలుగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రభుత్వంతో చర్చించి తిరుపతి -తిరుమల మధ్య నడిచే ఆర్టీసీ బస్సులను విడతల వారీగా మార్పు చేసేందుకు.. అవసరమైన చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి స్థలాలను తితిదే ఆర్టీసీకి కేటాయిస్తోంది.
ఇవీ చూడండి..తిరుమలలో రెండు రోజుల పాటు వారికి ప్రత్యేక దర్శనం..!