చిత్తూరు జిల్లా నగరి సమీపంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది. సెల్ ఫోన్లను రవాణా చేస్తున్న ఓ లారీని దుండగులు అపహరించారు. తమిళనాడులోని కాంచీపురం శ్రీపెరంబదూరు నుంచి ముంబయిలోని గోదాంకి సెల్ఫోన్లు తీసుకెళ్తున్న లారీని... ఏపీ సరిహద్దు వద్దకు రాగానే గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో లారీ డ్రైవర్ తెలిపాడు. తన కాళ్లు చేతులు కట్టి కింద పడేసి... లారీని తీసుకుని వెళ్లిపోయారని చెప్పాడు.
పుత్తూరు మరాఠి గేట్ దగ్గర జాతీయ రహదారి పక్కన లారీని పోలీసులు గుర్తించారు. లారీలో మొత్తం 16 బాక్సుల్లో సుమారు 15వేల సెల్ ఫోన్లు ఉండగా.. అందులో 8 బాక్స్‌ల సెల్ఫోన్లను వేరే లారీలోకి మార్చుకుని ఉంటారని నగరి పోలీసులు భావిస్తున్నారు. అపహరించిన సెల్ఫోన్ల విలువ సుమారు 7 కోట్ల రూపాయలు వరకూ ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. లారీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి