మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్న 279 గ్రామపంచాయతీలకు తొలిరోజు 252 నామినేషన్లు దాఖలయ్యాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో 101, పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 70, పలమనేరు నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో 81 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల, పుంగనూరు మండలాల్లో నామినేషన్లు వేసేందుకు వస్తున్న అభ్యర్థులను వైకాపా నేతలు అడ్డుకున్నారు.
సోమల మండలం పొదలకుంటపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బాబురావు అనే వ్యక్తి చేతిలోంచి నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లేందుకు వైకాపా కార్యకర్తలు యత్నించారు. దీన్ని గమనించిన ఎస్ఐ లక్ష్మీకాంత్.. వాళ్లను అడ్డుకున్నారు. బాబురావుతో నామినేషన్ చేయించారు.
పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ తెదేపా మద్దతుగారు నామినేషన్ వేయడానికి పత్రాలను సిద్ధం చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు అడ్డుకున్నారు. నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను మీ సేవా కేంద్రం నుంచి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో అడ్డుకొని చింపేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు వెంకటరమణ ఆరోపించారు.
ఇదీ చదవండి: ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు