ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి పయనమవుతారు. పలువురు పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలు జగన్ వెంట వెళ్లనున్నారు. సీఎం జగన్...దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పనుల నిమిత్తం రెండు,మూడు రోజులు ఉంటారని వైకాపా వర్గాలు పేర్కొన్నాయి. రేపు దిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో జగన్ పాల్గొనున్నారు. ఈ సమావేశంలో సీఎం..ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చే చర్యలు చేపట్టాలని కోరనున్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్ను కేంద్రం భరించాలని విభజన చట్టంలో ఉన్నందున..ఆ వివరాలను ముఖ్యమంత్రి నీతి ఆయోగ్ ముందు ఉంచనున్నట్లు తెలుస్తోంది.
రేపు ఉదయం వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని దిల్లీలో ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి వైఎస్ జగన్ అధ్యక్షత వహించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో జగన్ చర్చిస్తారు. రాష్ట్ర సమస్యలపై సభలో లేవనెత్తాల్సిన ప్రశ్నలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.