తెలుగుదేశం పార్టీ నుంచి హఠాత్తుగా పార్టీ మారిపోయి భాజపాలోకి చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరూ నిన్నటి వరకూ ఆ పార్టీ దృష్టిలో ఆంధ్రా మాల్యాలు. గతేడాది నవంబరులో భాజాపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్వయంగా చేసిన ఆరోపణ ఇది. అక్రమ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగవేసిన వ్యవహారంలో రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై ఆరోపణలు చేసిన పార్టీలోకే.. ఇప్పుడు ప్రవేశం దక్కింది.
వేల కోట్ల రూపాయలు ఎగవేతకు పాల్పడ్డ సీఎం రమేష్, సుజానా చౌదరి రాజ్యసభకు తగరంటూ గతేడాది నవంబరు 28న నైతిక విలువల కమిటీకి జీవీఎల్ లేఖ రాశారు. రాష్ట్ర స్థాయి నేతలు సైతం ఈ ఆరోపణలు చేశారు. ఉన్నట్టుండి వారిద్దరితోపాటు మరో ఇద్దరు కాషాయ కండువా కప్పుకునేసరికి కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి.
వెంటాడుతోన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు..
సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా మధ్య వివాదంలోనూ సీఎం రమేశ్ పేరు ప్రముఖంగా వినిపించింది. నగదు లావాదేవీల్లో సీఎం రమేష్ జోక్యం ఉన్నట్లు ఇరువురు డైరెకర్లు ఆరోపణలు చేసుకున్నారు. ఐటీ కేసుల్లో ఇరుకున్న ఆయన కంపెనీని ఆ కేసు నుంచి తప్పించేందుకు రమేష్ ముడుపులు ఇవ్వజూపారనేది ఆరోపణ. సీఎం రమేష్ కంపెనీ అయిన రిత్విక్ ప్రాజెక్ట్సులో చోటు చేసుకున్న ఈ సందేహాస్పద లావాదేవీలపై దాడి చేసిన ఐటీ శాఖ 100 కోట్ల రూపాయలకు అసలు లెక్కలే చూపలేకపోయారని వివరించింది. అక్టోబరు 12న హైదరాబాద్, కడపలలోని సీఎం రమేష్ నివాసాల్లో సోదాలు చేసింది. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయగానే సుజానా చౌదరి సీబీఐ ఆరోపణలు ఎదుర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ నమోదు చేసిన 3 ఎఫ్ఐఆర్‌లలో ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చారు. జాతీయ బ్యాంకుల కన్సార్షియం నుంచి 360 కోట్ల రూపాయల మేర అక్రమంగా రుణాలు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ పేరున స్వాహా చేశారని సీబీఐ అభియోగం. సుజనా గ్రూప్ జాతీయ బ్యాంకులను 5 వేల 700 కోట్ల రూపాయల మేర మోసం చేసిందనేదీ ఈడీ చేసిన మరో అభియోగం.
క్లీన్చిట్ ఇవ్వలేదు: జీవీఎల్
ఇదిలా ఉంటే తెదేపా ఎంపీల గురించి ఆనాడు ఇంతలా వ్యాఖ్యలు చేసిన జీవీఎల్.. ఈనాడు అదే తెదేపా ఎంపీలు భాజపాలో చేరిన సందర్భంపై ఆచితూచి స్పందించారు. మోదీ నాయకత్వం నచ్చి తాము భాజపాలోకి వచ్చామని ఎంపీలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వారి మీద ఉన్న కేసులపై తమ పార్టీ క్లీన్చిట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవటం కోసమే తాము ఎంపీలను చేర్చుకున్నామన్నారు. ఏమీ ఆశించకుండా భాజపాలోకి వచ్చేవారినే స్వాగతిస్తామని చెప్పారు.