ఎమ్మెల్యే కోటా... నలుగురు ఎమ్మెల్సీలతో పాటు గవర్నర్ కోటాలో 2 ఖాళీలు, విశాఖ స్థానిక సంస్థల ఉపఎన్నిక అభ్యర్థిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. దిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి 10 గంటల సమయంలో నివాసానికి చేరుకున్న ఆయన అర్ధరాత్రి దాటే వరకు కసరత్తు చేసి వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చారు. ఎమ్మెల్యేల కోటాలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 29తో కాలపరిమితి ముగియనుంది. ఈ ఐదు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణఉన్నారు. వీరితో పాటు శమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి, ఆదిరెడ్డి అప్పారావు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఐదింటిలో తెదేపాకి దక్కే నాలుగు స్థానాల్లో యనమల రామకృష్ణుడు, విశాఖ జిల్లాకు చెందిన దువ్వారుపు రామారావు, ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు, కర్నూలు జిల్లా నుంచి బీటీ నాయుడు పేరును ఖరారు చేశారు.
గవర్నర్ కోటాలో అనంతపురం జిల్లా నుంచి శమంతకమణికి మళ్లీ అవకాశం ఇచ్చారు. సోమిరెడ్డి రాజీనామాతో ఖాలీ ఆయిన స్థానం శమంతకమణికి కేటాయించారు. ఈమె కుమార్తె, ప్రభుత్వ విప్ యామినీబాల శింగనమల ఎమ్మెల్యేగా ఉన్నారు. శమంతకమణికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించటంతో యామినీబాలకు ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని సమాచారం. గవర్నర్ కోటాలో మరో స్థానం మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడి కుమారుడు శివనాథ్‌రెడ్డికి అవకాశం కల్పించారు. రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ముందస్తు ఒప్పందంలో భాగంగా శివనాథ్ రెడ్డికి కేటాయించారు. ఇక ఎంవీవీఎస్ మూర్తి అకాలమరణంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల కోటా స్థానాన్ని బుద్దా నాగ జగదీశ్వరరావుకు ఖరారు చేశారు.
సామాజిక, కుల, మత, ప్రాంత సమీకరణాలను బేరీజు వేసుకుని వీరిని అధినేత ఎంపిక చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేని పలువురికి అవకాశం కల్పించారు. మొత్తంగా 7ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో నలుగురు బీసీలకు స్థానం కల్పించారు.
నామినేషన్ల దాఖలుకు ఈరోజే చివరి తేదీ. పార్టీ సీనియర్లు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు టీడీఎల్పీలో సమావేశమై కొత్త అభ్యర్థులతో నామినేషన్ దాఖలు చేయించనున్నారు.