పోలీసు స్టేషన్లలో పెండింగ్ కేసుల పరిష్కారం నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లు నిర్వహించారు. పలు చోట్ల ఉచిత భోజనం, ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.
నరసన్న పేటలో..
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. రాజీ మార్గం ఉత్తమమైనదని, కేసుల సత్వర పరిష్కారానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుందని జడ్జి శ్రీనివాసరావు అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా చోడవరంలో...
విశాఖ జిల్లా చోడవరం కోర్టు సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. చోడవరం సీనియర్ సివిల్ జడ్జి కె.ఆర్.రాజివ్ సారథ్యంలో కేసులు విచారణ చేశారు. సర్కిల్ పరిధిలోని ఏడు పోలీస్ స్టేషన్లకు చెందిన కేసుల పరిష్కారానికి రాజీ ప్రయత్నాలు చేశారు. చాలావరకు ఎక్సైజ్ కేసులు పరిష్కారమయ్యాయి.
కడపలో...
ఏండ్ల తరబడి నుంచి పెండింగ్లో ఉన్న కేసులను క్షణాల్లో పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లాలోని 13 కేంద్రాలలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. సివిల్, క్రిమినల్, భూ తగాదాలు, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులు పరిష్కరించారు. జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో బాధితులు హాజరయ్యారు. లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి కోరారు. కేసులని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఉన్నతాధికారులకు సూచించారు.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో..
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో లోక్ అదాలత్ ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి అంజయ్య లోక్ అదాలత్ లక్ష్యాలను వివరించారు. రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకుని ధనం, కాలం వృథాను తగ్గించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: