రైతులకు చెల్లించాల్సిన మొత్తాలను తక్షణం విడుదల చేసి, తగినన్ని విత్తనాలను అందుబాటులో ఉంచాలని జనసేన అధినేత పవన్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు మొత్తం రూ.610.86 కోట్లు ధాన్యం కొనుగోలు కింద రైతులకు చెల్లించాల్సి ఉందని పవన్ తెలిపారు. వాటిని తక్షణమే చెల్లించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రైతులు విత్తనాల కొరతతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఈ ఏడాది 4.96 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయాల్సి ఉండగా.. 3లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అంచనా ఉందన్నారు. కానీ.. అక్కడ కేవలం 1.8 లక్షల క్వింటాళ్లు మాత్రమే వేరుశెనగ విత్తనాలు సరఫరా చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చే చోట విత్తనం దొరకడం లేదని.. బయట వ్యాపారుల గోదాముల్లో ప్రభుత్వ సంచుల్లోనే వేరుశనగ విత్తనం దొరుకుతోందని రైతులు చెబుతున్నారంటే.. లోపం ఎక్కడుందో ప్రభుత్వమే చెప్పాలని డిమాడ్ చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొనే పరిస్థితి కల్పించాలని ప్రభుత్వానికి జనసేనాని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి