తెలుగుదేశానికి కొందరు అధికారులు కొమ్ముకాస్తున్నారంటూ ఎన్నికల ముందు నుంచీ ఆరోపిస్తూ వస్తున్న వైకాపా ఇప్పుడు అధికారం దక్కించుకున్నందున కొందరికి బదిలీల బహుమానం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో కీలక పదవులు అనుభవించిన అధికారులకు స్థానచలనం, వైకాపా అనుకూల అధికారులకు అందలం దక్కనుంది. ఇప్పటి వరకూ చంద్రబాబు పేషీలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్‌లు సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళిలను కొత్త ప్రభుత్వంలో అప్రధాన పోస్టులకు బదిలీ చేస్తారని సచివాలయ వర్గాల్లోప్రచారంజరుగుతోంది. కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు కొందరు ఇప్పట్నుంచే... ప్రయత్నిస్తున్నారని తెలిసింది. రాజమౌళి సొంతరాష్ట్రం వెళ్లేపనిలోఉన్నట్లు సమాచారం. చంద్రబాబు పాలనలో మూడు శాఖలకు కీలక అధికారిగా వ్యవహరించిన అజయ్ జైన్ ఐటీ, విద్యుత్ శాఖలు చూస్తున్న విజయానంద్, నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్,రహదారులు, భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్,. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిపూనం మాలకొండయ్య, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ పేర్లు బదిలీల జాబితాలో ప్రముఖంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్నిశాఖల ప్రధాన కార్యదర్శులు, కొందరు జిల్లా కలెక్టర్లకూ స్థానచలనం తప్పకపోవచ్చని తెలుస్తోంది. ఇక జగన్‌పై కోడికత్తి దాడి ఘటన తర్వాత వైకాపా డీజీపీ ఠాకూర్‌పై గుర్రుగా ఉన్న నేపథ్యంలో ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్ పోలీస్ బాస్ అవుతారని చర్చ జరుగుతోంది. నిజానికి ఠాకూర్‌ను డీజీపీగా తొలగించాలని ఎన్నికల సమయంలోనే వైకాపా పట్టుబట్టింది.
అవినీతి నిరోధక శాఖ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు ఇంటిలిజెన్స్ బృందాన్నీ మార్చే అవకాశాలున్నాయి.
సుబ్రమణ్యమే సీఎస్
ఇక సీఎంగా ప్రమాణ స్వీకారానికి సన్నద్ధమవుతున్న జగన్ తన అధికారుల బృందంపైనా కసరత్తు వేగవంతం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్నిఅదే పదవిలో కొనసాలని ఇప్పటికే జగన్ కోరడంతో కీలక అధికారుల నియామకంపై జాబితా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జగన్ వెంట ఉన్న ధనుంజయ్ రెడ్డి సీఎం కార్యదర్శిగా ఉంటారని ప్రచారం సాగుతోంది. అయనతోపాటు జవహర్ రెడ్డి, బి.శ్రీధర్‌నూ సీఎం పేషీలోకి తీసుకునే అవకాశాలున్నాయి.