విజయవాడ నగరంలో కృష్ణాజిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఇంతియాజ్, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాస విశిష్టతను వివరించారు.
గుంటూరు నగరంలో జిల్లా తెదేపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
కడపలోని పెద్ద దర్గా ఆవరణలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరయ్యారు. రంజాన్ మాసంలోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదరులు సంతోషంగా రంజాన్ జరుపుకోవాలని కోరారు.
కర్నూలు జిల్లాలోని ఇఫ్తార్ విందులో కలెక్టర్ కలెక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా... ప్రార్థనలు చేయాలని కలెక్టర్ ముస్లిం మత పెద్దలను కోరారు. నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పటు చేసిన విందులో ముస్లింలు పెద్దఎత్తున పాల్గొని... ప్రార్థనలు చేశారు.
ముస్లింల సంక్షేమానికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ఎంపీ వంగా గీత, కలెక్టర్ కార్తికేయ మిశ్రా హాజరయ్యారు.
విశాఖ జిల్లాలో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. వీఎంఆర్డీఏ థియేటర్లో ఏర్పాటు చేసిన విందులో జిల్లా కలెక్టర్ కె. భాస్కర్, ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రార్థనలు చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రార్థనలు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని గిరిజన భవన్లో... జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. మత సామరస్యానికి రంజాన్ పండుగ ప్రతీక అని పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ అందరికీ మంచి చేకూర్చాలని ఆకాంక్షించారు. ఉపవాస దీక్షతో ఆధ్యాత్మిక చింతనతోపాటు... శాస్త్రీయమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వివరించారు.
ముస్లింల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఉద్ఘాటించారు. శ్రీకాకుళం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ధర్మాన హజరయ్యారు. కలెక్టర్ నివాస్, ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఇఫ్తార్ విందుకు హాజరై ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండీ... ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు