ఐదేళ్లకు ముందు.. పదేళ్ల పాటు.. ఉమ్మడి ఆంధ్రను ఏకధాటిగా ఏలిన కాంగ్రెస్... ఆ తర్వాత రాష్ట్ర విభజన తీరుతో కనిపించకుండా పోయింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అటు కేంద్రంలోనూ.. అధికారాన్ని కోల్పోయి దీన స్థితికి చేరిన జాతీయ కాంగ్రెస్కు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆక్సిజన్ అందించాయి. జాతీయ స్థాయిలో కాస్త బలం కూడదీసుకోవడంతో.. సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రాలో ఉనికి చాటుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని స్థానాలైనా 'హస్త' గతం చేసుకుని..పోయిన పరువును నిలబెట్టుకోవాలని ఆశ పడుతోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందించి కార్యకర్తలను సమాయత్తం చేస్తోంది. తమతోనే హోదా సాధ్యమంటూ... యాత్రలు నిర్వహిస్తోంది. రెండు, మూడు రోజుల్లో శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది.
హోదానే...ప్రచారాస్త్రం
తమ వల్ల జరిగిన నష్టాన్ని తామే పూడుస్తామంటూ.. విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదా నినాదాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంది. హోదా తమతోనే సాధ్యమంటూ ప్రచారం చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే.. తొలి సంతకం హోదాపైనే అంటూ హామీ ఇస్తోంది. హస్తం పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఏపీపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు ఇప్పటికే 4 సార్లు రాష్ట్రంలో పర్యటించారు. రాష్ట్ర నాయకత్వం రాహుల్ హామీలనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. హోదా అజెండాగా ఒక విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇంటింటికీ కాంగ్రెస్ పేరుతో బూత్ స్థాయిలోని ప్రతి ఇంటికీ వెళ్లిన కాంగ్రెస్... ఈ కార్యక్రమం నుంచి మంచి స్పందన వచ్చిందని భావిస్తోంది.
పోటీకి 1300 మంది ఆసక్తి
రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం తేల్చి చెప్పింది. అభ్యర్థుల ఎంపికను త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడానికి ఇప్పటికే 1300 దరఖాస్తులు వచ్చాయి. పట్టున్న నాయకులను గుర్తించి... అధిష్ఠానానికి పంపడం ద్వారా తుది జాబితాను సిద్ధం చేయనుంది.లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహుల వడపోత పూర్తయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఊమెన్ చాందీ, ఏఐసీసీ కార్యదర్శులు మెయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు.
ప్రచారానికి రాహుల్, ప్రియాంక!
ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం 25 పార్లమెంటు, 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఈ ఎన్నికల్లో గెలవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హస్తం పార్టీ.. రాహుల్,ప్రియాంకలను ప్రచార బరిలో దింపేందుకు ప్రణాళికలు వేస్తోంది.