ఏపీ, తెలంగాణ రెండు వేర్వేరు అనే భావన తమకు లేదన్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్రెడ్డి, కేసీఆర్. హైదరాబాద్ ప్రగతి భవన్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశంలో నదీ జలాల వివాదాలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని భావించారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నీటిని తరలించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. గోదావరి జలాలను శ్రీశైలంలోకి తరలించే ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సీఎంలు ఆదేశించారు.
నీటివనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఇరువురు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. ఇరు రాష్ట్రాల్లోని ప్రతిమూలకు సాగు, తాగునీరు అందించేందుకు కలిసి వెళ్లాలనే అభిప్రాయానికొచ్చారు. తెలుగు రాష్ట్రాలు రెండూ పచ్చగా కళకళలాడాలని.. సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీటికొరత రాకుండా చూడాలనేదే లక్ష్యమని ముఖ్యమంత్రులు అన్నారు. నదీజలాలపై గతంలోని వివాదాలను వదిలేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు మేలు చేయాలని ఏకాభిప్రాయంతో ఉన్నట్లు ఇరువురు ముఖ్యమంత్రులు తెలిపారు.
కమిటీ ఏర్పాటు..
గోదావరి నుంచి కృష్ణాకు జలాల తరలింపుపై కమిటీ ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఇరురాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కణ్నుంచి నీరు ఎలా తరలించాలనే విషయంపై కమిటీ నివేదిక ఇవ్వనుంది.
రేపు భేటీ..
విభజన అంశాలపై రేపు ఇరురాష్ట్రాల అధికారులు సమావేశం కావాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి