ఈవీఎంలలో లోపాలపై చెన్నై వేదికగా మరోసారి నిరసన గళం వినిపించారు... ముఖ్యమంత్రి చంద్రబాబు. తమ పోరాటం వల్లే.. వీవీ ప్యాట్ లు ఇప్పుడు అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. ఈవీఎంల ప్రోగ్రామింగ్‌లో మార్పులకు కారణం ఏంటని ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. సింగపూర్ సహా అభివృద్ధి చెందిన దేశాల్లో.. ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు వాడడం లేదని చెప్పారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లను ఎవరు తయారుచేశారో, ఎవరు ఆపరేట్ చేస్తున్నారో ప్రజలకు తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించడానికి ఎన్నికల సంఘానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంలో.. ఈసీ సమాధానం చెప్పాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని మరోసారి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు... స్వార్థంతో కాకుండా ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నట్టు స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఓటు వేస్తే మోదీకి వేసినట్లే అని ప్రజలకు చెప్పారు. కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను సీఎంగా చూడాలనేది తమిళ ప్రజల కోరికగా వ్యాఖ్యానించారు.