ఏపీలో రీపోలింగ్ జరపాలనే ఈసీ నిర్ణయం సరైంది కాదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం, ఆప్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఎన్నికలైన 34 రోజుల తర్వాత రీపోలింగ్ ఎందుకో అర్ధం కావటం లేదన్నారు. ఫిర్యాదు వస్తే విచారణ చేసి నిజానిజాలు తెలిశాక చర్యలు తీసుకోవాలన్నారు. అలా కాకుండా రీపోలింగ్ జరపాలని ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని సింఘ్వీ అన్నారు.
తెదేపా అనుకూల బూత్‌లలోనే రీపోలింగా?
రీపోలింగ్ విషయంలో చెవిరెడ్డి సీఎస్‌కు చెప్పినదాన్ని ఎన్నికల సంఘం ఫిర్యాదుగా తీసుకుని... రీపోలింగ్ జరుపుతున్నారని సీఎం రమేశ్ మండిపడ్డారు. చంద్రగిరిలోని 5 బూత్‌లు తెదేపాకు అనుకూలంగా ఉన్నాయనే ఉద్దేశంతో... ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. ఈసీ.. భాజపా కమిషన్ ఆఫ్ ఇండియాగా మారిందని ఆరోపించారు. ఈసీ నిర్ణయాలు పార్లమెంటులో చర్చకు వచ్చేలా చూస్తామని సీఎం రమేశ్ స్పష్టం చేశారు.
మా ఫిర్యాదులు పట్టించుకోరా..
మేం ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తామన్న ఈసీ... భాజపా, వైకాపా చెప్పినట్టు చేస్తొందని కంభంపాటి ఆరోపించారు.