రాష్ట్రంపై భానుడు ఉగ్రరూపం దాల్చుతూ పంజా విసురుతున్నాడు. గరిష్ఠ ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టాలంటనే జంకుతున్నారు. వారంనుంచి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల్ని మరింత ఆందోళనలకు గురి చేస్తున్నాయి. రాబోయే రెండు, మూడు రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా ప్రజల్ని అప్రమత్తంగా చేస్తోంది అధికార యంత్రాంగం. ఎండనుంచి కాపాడుకునేందుకు.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడేందుకు సూచనలు చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని ఇప్పటికే వాతావారణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బయట ఎక్కువగా తిరగరాదని హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎండ సమయంలో బయటికి వెళ్తే రక్షణ సాధనాలను వినియోగించాలని సూచిస్తున్నారు.
అసలు ఈ వడదెబ్బకు గల కారణమేంటి..?
ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి మెదడు మీద ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితుల్లో శరీరం వేడిని అదుపు చేసుకోలేకపోవటం, చెమట ద్వారా నీరు, లవణాలు కోల్పోవటం జరుగుతుంది. శరీరాన్ని చల్లబరిచే వ్యవస్థ పనిచేయని పరిస్థితిలో.. ప్రాణాలకే ముప్పు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి.