YCP Leader Arrest in Ganja Case: బాపట్ల జిల్లాలో వైకాపా ఎంపీటీసీ గంజాయి అక్రమ రవాణాపై తీగ లాగితే డొంక కదిలింది. వైకాపా ఎంపీటీసీతో సంబంధం ఉన్న మరికొందరు నిందితులను పట్టుకున్న పోలీసులు.. మొత్తం 14 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎంపీటీసీని గోవిందయ్య సహా మిగిలిన వాళ్లను రిమాండ్‌కు తరలించారు. వీళ్లకు ఎక్కడి నుంచి గంజాయి అందుతుందనే విషయం తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
బాపట్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన ఘటనలో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. గత నెలలో సూర్యలంకలో నమోదైన గంజాయి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంలో ఆ కేసుకు సంబంధం ఉన్న వ్యక్తులు ఇచ్చిన ఆధారాలతో పోలీసులు వైసీపీ ఎంపీటీసీ ఇంట్లో సోదాలు నిర్వహించి.. కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
సూర్యలంకలో గత నెలలో ఇద్దరు వ్యక్తుల వద్ద పోలీసులకు గంజాయి దొరికింది. బాపట్ల స్పెషల్ పార్టీ పోలీసులు వీరికి గంజాయి ఎవరు సరఫరా చేశారనే విషయం విచారణ చేపట్టారు. స్టూవర్టుపురానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర నుంచి గంజాయి తీసుకున్నట్లు పట్టుబడ్డ ఇద్దరు యువకులు తెలియచేశారు. ఈ నేపథ్యంలో స్టూవర్ట్పురానికి చెందిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బాపట్ల పోలీసులు విచారణ చేపట్టినట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
చిన్నగంజాం మండలం మోటుపల్లికి చెందిన ఓ నేత తనకు క్రమం తప్పకుండా గంజాయి సరఫరా చేస్తున్నాడని, అక్కడ నుంచి తీసుకొచ్చి జిల్లాలో పలు ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు చెప్పారు. దీంతో నిన్న చిన్నగంజాం మండలం మోటపల్లికి వెళ్లిన పోలీసులు ఎంపీటీసీ ఇంటి పై దాడి చేయగా గంజాయి పట్టు పడిందని పోలీసులు వెల్లడించారు. వైసీపీ ఎంపీటీసీ గోవిందయ్యను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిన తర్వాత.. అతనిని వదిలి పెట్టమని అధికార పార్టీ నేతల నుంచి పోలీసులకు ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అప్పటికే మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంపీటీసీ గోవిందయ్యతో పాటుగా ఆయన తండ్రి సోమయ్య, వెంకటేశ్వర్లు, చంద్రలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి మొత్తం 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.
'బాపట్ల జిల్లాలో గంజాయి అక్రమ రవాణపై ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. అదే సమయంలో వేంకటేశ్వర్లు అనే వ్యక్తి వద్ద గంజాయి లభించింది. అతనిని విచారించాం. అతను ఇచ్చిన సమాచారం మేరకు గోవిందయ్య, సోమయ్యతో పాటుగా మరి కొంత మంది వ్యక్తుల ఇంట్లో సోదాలు నిర్వహిస్తే, వారి వద్ద సుమారు 14 కిలోల గంజాయి లభించింది. వారిపై కేసు నమోదు చేశాం.'- శ్రీనివాసరావు, డీఎస్పీ, బాపట్ల
ఇవీ చదవండి