Gonasapoodi village: స్వచ్ఛ గొనసపూడికి శ్రీకారం చుట్టే నాటికి 580 ఇళ్లలో మరుగుదొడ్లు ఉండేవి. అయినా రోజుకు సుమారు 200 మంది ఆరుబయట మలవిసర్జన చేసేవారు. దీన్ని పూర్తిగా నిర్మూలించాలని గ్రామ పెద్దలు, ప్రజల సాయంతో సర్పంచి దీప్తి భర్త, పారిశ్రామికవేత్త అయిన విక్రం నారాయణరావు ప్రణాళిక రూపొందించారు. మరుగుదొడ్లు కట్టుకోలేని 25 మందికి రూ.15 వేల చొప్పున అందజేశారు. స్థలం లేని వారికి, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ప్రాథమిక, యూపీ పాఠశాలలో 9 మరుగుదొడ్లు నిర్మించారు. వాటి తాళం చెవులను వారికే అప్పగించారు. సచివాలయ సిబ్బందికి, పాలకవర్గానికి, అక్కడికి వచ్చే ప్రజల కోసం సుమారు రూ.2 లక్షలతో ఆధునిక మరుగుదొడ్లు నిర్మించారు. ఇందుకు నారాయణరావు సుమారు రూ.7 లక్షలు అందించారు.
యువకులతో అవగాహన: ఇంత చేసినా కొందరు ఆరుబయట మలవిసర్జన అలవాటును మానుకోలేకపోయే వారు. దీంతో ఇతర ప్రాంతాల్లో వివిధ ఉద్యోగాలు చేసుకుంటున్న గ్రామ యువకులను పిలిపించి, ఇంటింటికీ అవగాహన కల్పించారు. వారి సమక్షంలోనే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేస్తే రూ.500 అపరాధ రుసుం చెల్లించేలా నిబంధన పెట్టారు. కరపత్రాలతో ప్రచారం చేశారు. రూ.6లక్షలతో గ్రామం చుట్టూ 60 సీసీ కెమెరాలు, మైకులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 25 మంది చెంబు పట్టుకొని బయటికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. అపరాధ రుసుం చెల్లించారు. డబ్బాలు, చెంబుల్లో నీటితో బయట కనిపిస్తే ‘డబ్బా రాయుళ్ల’ని మైకులో పేరు వినిపిస్తుందని అప్పటి నుంచి బయటికెళ్లడం దాదాపుగా మానేశారు. కెమెరా కన్ను వల్ల ఆరుబయట మద్యం తాగే వారూ తగ్గారు.
* ‘గ్రామస్థుల సాయంతో స్వచ్ఛ గొనసపూడికి కృషి చేస్తున్నా. ఇందుకు నెలకు సుమారు రూ.80 వేల సొంత నిధులు ఖర్చు చేస్తున్నా. ఈ ఏడాది గాంధీ జయంతి నాటికి 100% బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనను నిర్మూలిస్తాం. ఇప్పటి వరకు 99 శాతం సాధించాం’ అని విక్రం నారాయణరావు వివరించారు.
ఇవీ చదవండి: