Three Persons Died in Road Accident: సన్నిహితులతో కలిసి సరదాగా సాగించిన ప్రయాణం ముగ్గురిని కబళించగా.. మరొకరిని ఆసుప్రతి పాలు చేసింది. ఈ ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కోనంకి పైవంతెన వద్ద శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. మార్టూరు మండలంలోని డేగరమూడి, రాజుపాలెం, కోనంకి, ద్వారకపాడు గ్రామాలకు చెందిన కొండపల్లి శివశంకర్(38), నల్లపనేని రామకృష్ణ(35), వీరవల్లి వెంకటరావు(58), ఎలగా అనిల్‌లు.. అనిల్ కారులో సాయంత్రం వేళ సరదగా బొల్లాపల్లి టోల్‌ప్లాజా వైపు ప్రయాణిస్తుండగా హైవే వెంట నిలిపిన పాల ట్యాంకర్ రోడ్డు ప్రమాద రూపంలో ముగ్గురిని మృత్యుఒడిలోకి తీసుకెళ్లింది.
ఈ ప్రమాదంపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా వి.కోట నుంచి తెనాలి సమీపంలోని వడ్లమూడికి వస్తున్న పాల ట్యాంకర్ కోనంకి సమీపంలో టైర్ పంక్చర్ కావడంతో రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో అదే రూట్లో వస్తున్న కారు.. ఆగి ఉన్న ట్యాంకర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్, రామకృష్ణలు మృతిచెందగా, వెంకటరావును హైవే అంబులెన్సులో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. కారు డ్రైవ్ చేస్తున్న అనిల్.. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరాడు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సీఐ ఫిరోజ్, ఎస్సై కమలాకర్ తమ సిబ్బందితో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
ఘటనాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్: ప్రమాద సంఘటనను తెలుసుకున్న జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెంటనే ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చి కారు ప్రమాదంపై పోలీసు అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పెట్రోలింగ్ పటిష్ఠంగా నిర్వహించాలని సూచించారు.
Road Accident in Addanki: రాంగ్ డైరెక్షన్లో ప్రయాణిస్తున్న ఆటో.. ఎదురుగా వస్తున్న స్కూటీని ఢీకొట్టింది. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి పట్టణంలో జరిగింది. పట్టణంలోని గీతామందిరం వద్ద నివసించే పూజిత, మరో యువతి శుక్రవారం సాయంత్రం ఒంగోలు నుంచి స్కూటీపై అద్దంకి వస్తున్నారు. వీరి ద్విచక్రవాహనాన్ని మధురానగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో స్కూటీని నడుపుతున్న పూజిత కాలికి తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న యువతికి ఎలాంటి గాయాలు కాలేదు. గాయపడిన పూజితకు 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేట తరలించినట్లు వెల్లడించారు.