EXPENSIVE LAMBS: వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న ఈ పొటేళ్లను ఎక్కడైనా చూశారా? బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లికి చెందిన డి.కె. రెడ్డి.. రెండేళ్ల నుంచి ఇటువంటి పొటేళ్లను పెంచుతున్నారు. కొవిడ్ సమయంలో ఖాళీగా ఉండలేక.. తండ్రి పెంచుతున్న పొటేళ్ల పెంపకాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. మేలు రకం పొటేళ్లను తెచ్చి.. తండ్రి సాయంతో పెంచడం మొదలుపెట్టారు. వాటికిచ్చే ఆహారం విషయంలోనూ రాజీ పడకుండా.. మంచి ఆహారం అందించారు. పొటేళ్లు త్వరగా పెరగటమే కాకుండా.. చూసేందుకు ముచ్చటగా, గొప్పగా కనిపిస్తున్నాయి.
సాధారణంగా మాంసం కోసం పెంచే పొటేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ వీటికి బరువుతో పని లేదు. కేవలం రూపం, ఆరోగ్యంగా ఉండటం మాత్రమే చూస్తారు. ఇక్కడ ప్రధానంగా నాటు రకాలు, చుక్కల జాల రకాల్ని పెంచుతున్నారు. మన రాష్ట్రంలో ఈ రెండు రకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఇక్కడి పొటేళ్లని కొనుగోలు చేస్తుంటారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి కూడా వస్తుంటారని డి.కె.రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం బక్రీద్ సీజన్ కావటంతో ఖుర్భానీ కోసం ఎక్కువమంది పొటేళ్లు తీసుకెళ్తున్నారు. మిగిలిన సమయాల్లో బ్రీడింగ్ కోసం కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా పొటేళ్లు పందాలకు కూడా పనికొస్తాయి. కాబట్టి అన్ని రకాలుగా ఉపయోగపడతాయనే భావనతో కొనుగోలు చేస్తుంటారు. ఖుర్బానీకి ఇచ్చే పొటేళ్లకు మంచి ఆరోగ్యం ఉంటే ధర పెట్టడానికి వెనుకాడరని కొనుగోలుదారులు అంటున్నారు.
ఇవీ చదవండి: