Nara Lokesh Yuvagalm Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర బాపట్ల జిల్లాలోకి ప్రవేశించింది. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం తిమ్మానపాలెం వద్ద యువగళం పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. అద్దంకి నియోజకవర్గ శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు. నారా లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు భారీ కార్యకర్తలు తరలివచ్చారు.
అమరావతి రైతుల సంఘీభావం: ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాలోకి ప్రవేశించిన యువగళం పాదయాత్రను రాజధాని అమరావతి రైతులు సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులు ప్లకార్డులు చేతపట్టి ప్రదర్శించారు. రాజదానికి భూమిని ఇచ్చి అబాసుపాలయ్యామని.. రాబోయేది చంద్రబాబే.. మన రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేయగల నాయకుడని గుర్తించి తమ పొలాలను రాజదాని కోసం దారపోశామని అన్నారు.
జ్ఞాపికగా లోకేశ్ అద్భుత చిత్రం: కాగా అంతకు ముందు యువగళం పాదయాత్రలో భాగంగా ప్రకాశం, బాపట్ల జిల్లాల సరిహద్దులో గుళ్లాపల్లి క్యాంప్ సైట్లో పర్చూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నారా లోకేశ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. గుళ్లాపల్లి సభా ప్రాంగణం పర్చూరు నియోజకవర్గ ప్రజలతో కిక్కిరిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గెలాక్సీ గ్రానైట్‌తో తయారు చేయించిన అద్భుత చిత్రాన్ని లోకేశ్‌కు జ్ఞాపికగా అందజేశారు.
నాయకులు వస్తూ పోతూ ఉంటారు.. కార్యకర్తలే శాశ్వతం: ఈ సందర్భంగా నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 5 కోట్లమంది ప్రజల ఆశీస్సులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రోత్సాహమే తనను ముందుకు నడిపిస్తోందని నారా లోకేశ్ పేర్కొన్నారు. జిల్లాలో పెద్దాయన అని చెప్పుకుని తిరిగిన వ్యక్తి పార్టీ మారినా.. కార్యకర్తలు మారలేదన్నారు. నాయకులు వస్తూ పోతుంటారు, కార్యకర్తలే శాశ్వతమని నారా లోకేశ్ తెలిపారు.
భారీ కూరగాయల గజమాలతో స్వాగతం: గుళ్లాపల్లి కూడలికి వచ్చిన లోకేశ్‌కు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు, మహిళలు కూరగాయలతో తయారుచేసిన గజమాలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది వస్తే నేరుగా పార్టీనే స్పందిస్తోంది.. ఏ పార్టీ చేయని విధంగా కార్యకర్తలకు సంక్షేమ నిధితో పాటు బీమా కల్పించామన్నారు.
రాష్ట్రం సరైన దారిలో లేదు: గత నాలుగేళ్లలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని.. అక్రమ కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాష్ట్రం సరైన దారిలో లేదన్న లోకేశ్.. రాబోయే తరాలు బాగుండాలంటే చంద్రబాబు సీఎం అవ్వాలని అన్నారు. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందని.. అందరం కలసి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. పని చేసేవాళ్లను పార్టీలో ప్రోత్సహిస్తామని చెప్పారు. పార్టీకి మెజార్టీ తీసుకురండి, మీ భవిష్యత్ నేను చూసుకుంటానని నియోజకవర్గ ప్రజలకు లోకేశ్ భరోసా ఇచ్చారు.
ఈ సారి భారీ మెజారిటీతో గెలవాలి: పర్చూరులో మళ్లీ టీడీపీ జెండా ఎగరాలని.. ఏలూరి సాంబశివరావును భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఎదురుదాడులను పర్చూరు ప్రజలు ఎదుర్కొన్నారని.. పర్చూరు ప్రజలు చాలా తెలివైన వాళ్లని అన్నారు. ఈ సారి నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవాలని.. ప్రతి ఒక్కరూ కలసి పని చేయాలని తెలిపారు.
వైసీపీ వాళ్లకు కార్యకర్తలు బుద్ధి చెప్పారు: రాష్ట్రంలో తొలుత టీడీపీ శ్రేణులపై దాడులు చేశారని.. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులకు పాల్పడ్డారని.. ఇప్పుడు ఏకంగా పోలీసులపై కూడా దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, పెట్రోల్, గ్యాస్ వంటివి విపరీతంగా పెరిగిపోయాయన్నారు. తాను పాదయాత్ర ప్రారంభించినప్పుడు అడ్డుకుంటామన్నారని.. కానీ కార్యకర్తలు వైసీపీ వాళ్లకు బుద్ధి చెప్పారని తెలిపారు.
ఓడిపోయానని వదిలేయలేదు: ప్రతి ఇంటి తలుపు తట్టండి.. చివరి ఓటు పడే వరకూ కాపలా కాయాలని నారా లోకేశ్ సూచించారు. ఫలానా వ్యక్తి ఓటు వేయరు అని అనుకోవద్దు.. ఒకటికి పది సార్లు తిరగండని పేర్కొన్నారు. మంగళగిరిలో ఓడిపోయానని తాను వదిలి వెళ్లిపోలేదని.. ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు.
టీడీపీకి ఓటేసేందుకు వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు: పర్చూరును గుండెల్లో పెట్టి చూసుకుంటానని.. పర్చూరు బాధ్యత తనదేనని లోకేశ్ అన్నారు. జగన్ పనైపోయిందన్న భావనలో వైసీపీ కార్యకర్తలున్నారని.. జగన్ తీరు నచ్చక టీడీపీకి ఓటేయడానికి వైసీపీ కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి జగన్ అరాచక పాలనపై చైతన్యం తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.