Quid pro quo of field level leaders in YCP: ప్రభుత్వ స్థలాన్ని కాపాడాల్సిన అధికారులు.. రియల్టర్లకు రెడ్ కార్పెట్ పరిచారు. అధికార వైఎస్సార్సీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అవసరం లేని పనులకు లక్షలు వెచ్చించి ఆగమేఘాలపై పూర్తి చేశారు. అద్దంకిలో జనసంచారం లేని ప్రాంతంలో సీసీ రోడ్డు వేసిన అధికారులు.. ఓ రియల్టర్‌కు కోట్లు మేలు చేసేలా పరోక్షంగా సహకరించారు. రియల్టర్, అధికారుల మధ్య వారధిగా పని చేసిన వైసీపీ నేత కోటి రూపాయలు లబ్ధి పొందినట్లు సమాచారం.
చేతులు మారిన కోటి రూపాయలు.. క్విడ్ ప్రోకో విషయాన్ని అధికార వైసీపీలోని క్షేత్రస్థాయి నేతలు సైతం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆస్తులను పణంగా పెట్టి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా సమస్య ఉందంటే చాలు.. రెక్కలు కట్టుకుని వాలిపోయి పరిష్కారం పేరిట దళారీ పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ భూముల విషయంలో.. అధికారులు, రియల్టర్లకు మధ్య మీడియేటర్లుగా వ్యవహరిస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఈ అవినీతి చదరంగంలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. అద్దంకి మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకానగర్‌లో ఇటీవల జరిగిన సీసీ రోడ్డు నిర్మాణం వెనక కోటి రూపాయల కథ దాగి ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారికి సహకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు.. బాపట్ల జిల్లా అద్దంకి పురపాలక సంఘం పరిధిలోని సర్వే నంబర్ 19లో 2 ఎకరాల 77 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దానిలో ఎకరం 20సెంట్ల భూమి అన్యాక్రాంతం కాగా, మిగిలిన మరో ఎకరం 57 సెంట్ల భూమిలో కొంత మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వెంచర్ దారి కోసం ఆక్రమించాడు. దాదాపు 40 అడుగుల వెడల్పు 300అడుగుల మేర ప్రభుత్వ భూమి ఆక్రమించాడు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందన్న విషయం తెలిసిన రెవెన్యూ అధికారులు.. కొలతలు వేసి స్తంభాలు పాతి కంచె వేశారు. ఆ భూమిని పురపాలక సంఘం అవసరాలకు వినియోగించుకునేందుకు బదలాయింపు చేశారు. స్థలానికి ప్రహరీ నిర్మించేందుకు అద్దంకి వైఎస్సార్సీపీ బాధ్యుడు శిలాఫలకం వేయడంతో పనులు ఎప్పుడు ప్రారంభిస్తారోనని స్థానిక ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కోటి రూపాయలు చేతులు మారాయి. వైసీపీ నాయకుడి ఎంట్రీతో కథ మలుపు తిరిగింది.
సీసీ రోడ్డు నిర్మాణం.. జన సంచారం ఏ మాత్రం లేని ఆ ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తెరమీదికొచ్చాయి. పనులకు ఆమోదం లభించింది. రూ.15లక్షల వ్యయంలో పనులు చకచకా పూర్తయ్యాయి. సీన్ కట్ చేస్తే.. ప్రభుత్వ భూమికి ప్రహరీ నిర్మాణానికి బదులు.. వెంచర్‌కు రాజమార్గం ఏర్పడింది. రియల్టర్.. మున్సిపాలిటీ వేసిన సీసీ రోడ్డును కలుపుకొని వెంచర్ వరకు చక్కని రోడ్డును నిర్మించుకున్నాడు. కానీ, అధికార పార్టీ నాయకుడిని మచ్చిక చేసుకుని ఈ తతంగాన్నంతా నడిపేందుకు తనకు దాదాపు కోటి రూపాయలు ఖర్చయినట్లు సన్నిహితుల వద్ద వాపోయాడు.
సీసీ రోడ్డు నిర్మాణ విషయమై పురపాలక సంఘం కమిషనర్‌ను వివరణ కోరగా 'నాకంటే ముందుగా ఇక్కడ అధికారులు చేసిన పనులకు నేను ఎలా సమాధానం ఇవ్వగలను..? సిమెంట్ రోడ్డు ప్రతిపాదనలు మాత్రం వచ్చాయి. కానీ, ఆ పని ఎవరికి అనుకూలించిందనేది నేనెలా చెప్పగలను' అంటూ సున్నితంగా దాటవేశారు.