Chandrababu Visit to Cyclone Affected Areas: మిగ్జాం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు పర్యటనలో భాగంగా బాపట్ల, పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో రైతులు, ప్రజలకు జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. పర్చూరులో రైతులను పరామర్శించి వారి కష్టాలు తెలుసుకున్నారు. రైతులకు విత్తనాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమా అని ప్రశ్నించారు.
రైతు బాధల్ని పట్టించుకోని ముఖ్యమంత్రిని దేవుడు కూడా క్షమించడని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి అహంకారానికి రాష్ట్ర రైతులు బలైపోయారని మండిపడ్డారు. అన్నదాతల ఆత్మ బలిదానాలకు సీఎం అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. తుపానుపై రైతుల్ని అప్రమత్తం చేస్తే నష్టం తగ్గేదన్నారు.
యానాదుల్ని, వారి పిల్లల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదే: చంద్రబాబు నాయుడు
కనీసం ప్రధానిని కూడా కోరలేదు: విపత్తు నష్టం నుంచి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కనీసం ప్రధానిని కూడా కోరలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర సాయం అడగాలని కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియదేమోనని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కనీసం అడ్డుకోవడం కూడా తెలియని అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ అని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఇసుకపై ఉన్న ప్రేమ, రైతుల పైనా, నీటి నిర్వహణ పైనా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. డ్రైనేజీ, సాగునీటి, రహదారుల వ్యవస్థల్ని పూర్తిగా నాశనం చేశాడని ఆక్షేపించారు.
పట్టిసీమ నీటిని ముందుగా వదిలినా అక్టోబర్ నాటికే పంట చేతికొచ్చేదని తుపాను నష్టం రైతులకు తప్పేదన్నారు. చెరుకూరు గ్రామం మీదుగా వెళ్తూ పంట నీటమునిగి దిక్కుతోచని స్థితిలో ఉన్న శ్రీనివాసరావు అనే రైతు దంపతులను చంద్రబాబు పలకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందక పోగా, దెబ్బతిన్న పంటను పొలం నుంచి తీసేందుకే పెట్టుబడికి మించి ఖర్చవుతోందని రైతులు విలపించారు.
జగన్కు ఉల్లిగడ్డ, ఆలుగడ్డకు తేడా తెలియదు - రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి?: చంద్రబాబు
రైతుకు 2 లక్షల సాయం: నిండా అప్పులపాలైపోయామంటూ రైతులు బాధను వ్యక్తం చేశారు. మళ్లీ అప్పు పుడితే కానీ దెబ్బతిన్న పంటను తొలగించలేమని కన్నీటి పర్యంతమైయ్యారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న 6 ఎకరాల మిరప తోటను పీకేస్తున్న తీరును చూసి చలించిపోయారు. వెంటనే రైతుకు 2 లక్షల సాయాన్ని బాబు ప్రకటించారు.
తెలుగుదేశం-జనసేన గెలుపు మార్పునకు నాంది పలకాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నల్లమల డ్రైన్ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటామన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరిస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయామనే అధైర్యంతో అఘాయిత్యాలు చేసుకోవద్దని చంద్రబాబు రైతుల్ని కోరారు. అనంతరం పత్తిపాడు నియోజకవర్గంలోని చిననందిపాడు, పెదనందిపాడులో చంద్రబాబు పర్యటన సాగింది.
అహంకారం ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశాం - మరో 3 నెలల్లో ఇక్కడా చూస్తాం: చంద్రబాబు
పర్చూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుని చూసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. స్వాగతాలు వద్దని చంద్రబాబు వారిస్తున్నా వినని అభిమానులు ప్రతీ గ్రామంలో ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అందరికీ అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. రోడ్డుకు ఇరువైపులా మహిళలు నిలబడి హారతులు పట్టి చంద్రబాబుకు స్వాగతం పలికారు.