Cases Filed on False Form 7 Applicants in Parchur: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో మార్పుల కోసం వైసీపీ పన్నిన కుట్రలు బట్టబయలయ్యాయి. విపక్షాల ఓట్లు తొలగించాలని ఉద్దేశపూర్వకంగా ఫారం 7 దరఖాస్తు చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పర్చూరు, యద్దనపూడి, చినగంజాం మండలాల్లో పెద్ద ఎత్తున దొంగఓట్లు నమోదు చేశారు.
అలాగే టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించాలని ఎలక్ట్రోరల్ అధికారులకు ఫారం7 దరఖాస్తులు పెట్టారు. వీటన్నింటిని టీడీపీ నాయకులు ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదు. ఉపాధి కోసం వేరే చోటికి వెళ్లిన వారి ఓట్లను సొంతూర్లో ఉండటం లేదనే కారణంతో తొలగించాలని.. అలాగే బతికున్న వారిని సైతం చనిపోయారని ఫారం 7 దరఖాస్తులు పెట్టారు. ఆధారాలతో సహా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికారులకు ఫిర్యాదు చేసినా.. పైనుంచి వచ్చిన ఒత్తిళ్లతో అధికారులు వాటిని పట్టించుకోలేదు.
దీంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ నెల 27వ తేదీన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించేందుకు అధికార పార్టీ నేతలు కుట్ర పన్నారని, స్థానిక యంత్రాంగం దీనికి సహకరిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. అందుకు తగిన ఆధారాలు జతపర్చారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో పర్చూరు నియోజకవర్గంలోని అధికారుల్లో ఒక్కసారిగా కదలిక వచ్చింది. తప్పుడు ఫారం 7 దరఖాస్తులు పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పర్చూరు, యద్ధనపూడి, చినగంజాం మండలాల పరిధిలో ఎక్కువగా తప్పుడు ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. వీటిపై గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఎలక్ట్రోరల్ అధికారి వెంకటరమణ ఫిర్యాదుతో తప్పుడు ఫారం 7 దరఖాస్తులు ఇచ్చిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
పర్చూరు నియోజకవర్గంలోనే 14 వేల వరకూ ఫారం 7 దరఖాస్తులు పెట్టినట్లు సమాచారం. వైసీపీకి చెందిన దాదాపు 200 మంది ఉద్దేశపూర్వకంగా ఈ కుట్రలో పాలుపంచుకున్నారు. ఈ విషయంపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని.. ఇప్పుడు హైకోర్టుకు వెళ్లేసరికి అధికారుల్లో చలనం వచ్చిందని టీడీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. ఓట్ల తొలగింపుపై న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు. బతికి ఉన్న వాళ్లను సైతం చనిపోయారని ఫారాలు పెట్టటం అధికార పార్టీ చేస్తున్న అరాచకానికి నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
అనంతపురం జిల్లాలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు జిల్లాస్థాయి అధికారులపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేటు వేశారు. అది చూసిన తర్వాత కూడా ఇతర అధికారుల్లో చలనం రాలేదు. ఇప్పుడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు కావటంతో తప్పుడు వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందనే ఆందోళనతో హడావుడిగా పోలీసులకు ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.