Minister Jogi Ramesh: అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ పర్యటించారు. నారాయణరెడ్డి పల్లెలోని జగనన్న లే అవుట్లను పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణాల పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో ఎమ్మెల్యేలు అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల గృహ నిర్మాణాల ప్రగతిపై నియోజకవర్గాల వారిగా సమీక్షించారు. జగనన్న కాలనీల నిర్మాణాలకు సంబంధించి తాగునీరు విద్యుత్ రహదారులు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాల్సి ఉందని కొందరు ఎమ్మెల్యేలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మరికొన్ని చోట్ల పనుల పురోగతి లేదని.. కనీసం పునాదులు కూడా పూర్తి కాలేదన్న విషయాన్ని సమావేశంలో చర్చకు తీసుకువచ్చారు.
బాధితుల గోడు వినని మంత్రి: మంత్రి జోగి రమేశ్ వస్తున్నారని తెలిసి అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సమీక్ష అనంతరం మంత్రి బయటకు రాగానే ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా పోలీసులు వారిని కలవకుండా అడ్డుకున్నారు. తమకు సీఎం ఇచ్చిన హామీ ప్రకారం.. ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి బాధితులు అక్కడకు వచ్చామని తెలిపారు. దీంతో వారి గోడు వినేవారు ఎవరూ లేరని బాధితులు వాపోయారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని.. వ్యయప్రయాసాలకు ఓర్చి ఇంత దూరం వస్తే కనీసం మా గోడు పట్టించకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్‌తో మాట్లాడించిన ఎమ్మేల్యే: ఈ విషయం రాయచోటి ఎమ్మెల్యే గడ్డి కోట శ్రీకాంత్ రెడ్డి బాధితులతో మాట్లాడారు. మీ సమస్య గూర్చి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇదివరకే మంత్రి దృష్టికి తీసుకువచ్చారని వారికి తెలిపారు. కావాలంటే కలెక్టర్‌తో మాట్లడిస్తానని.. కలెక్టర్ దగ్గరికి బాధితులను తీసుకువెళ్లారు. వారు కలెక్టర్‌కు వారి గోడు వెళ్లబోసుకున్నారు. 2021 నవంబర్‌లో వచ్చిన వరదలతో.. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి పులపుత్తూరు దళితవాడ మరో రెండు గ్రామాలు నీటిలో మునిగిపోయాయని వివరించారు. వరద దాటికి ఇల్లు కోల్పోయామని బాధితులు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకుంటామని హామీ ఇచ్చారని.. మూడు నెలల్లోనే ఇల్లు నిర్మించి ఇస్తామని.. సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవటం లేదని వాపోయారు. సంవత్సర కాలం నుంచి ఎదురు చూస్తున్నామని అన్నారు.
ఇవీ చదవండి: