కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇష్టారీతిన దోచుకుంటున్నాయని.. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా రాసిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎంకు చేతకాకపోతే.. కడప ఉక్కు పరిశ్రమను ఏర్పాటును గాలి జనార్ధన్ రెడ్డికి అప్పగించాలన్నారు. మంచోడో.. చెడ్డోడో కట్టి చూపిస్తాడని అన్నారు. ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో.. సీఎం జగన్ రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉన్నట్టు రాష్ట్రంలో వ్యవహరిస్తూ.. ఢిల్లీ వెళ్లి ప్రైవేట్ పరం చేయాలని చెబుతున్నారని అన్నారు. నమ్మి ఓట్లు వేసిన మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలను.. అణగదొక్కుతున్నారని ఆరోపించారు.
కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమి తయారవుతోందని.. ఇప్పటికే బీహార్ సీఎం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేశారన్నారు. జగన్ కూడా ఎన్డీఏ దోస్తీ కటీఫ్ చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలకు న్యాయం జరగాలంటే.. జగన్మోహన్ రెడ్డి భాజపా సంకెళ్లు తెంచుకోవాలని సూచించారు. లేకుంటే.. భాజపా, వైకాపాలను ప్రజలు సముద్రంలో తోసేస్తారని హెచ్చరించారు.
నరేంద్రమోదీ సర్కారుపైనా ధ్వజమెత్తారు. కేంద్రంలో ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేశారని.. త్వరలోనే జనరల్ ఆసుపత్రిని కూడా ఆదానికి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయని విమర్శించారు. ఖరీదైన డ్రస్సులతో ప్రజలకు అందంగా కనిపించడం తప్ప, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశానికి చేసింది ఏమీ లేదని అన్నారు. దోచుకున్న వారిని, దాచుకున్న వారిని కాపాడుతూ వస్తున్నారని విమర్శించారు.