నేడు.. అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కంటివెలుగు పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్దితో కలిసి... ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడంతో కార్యక్రమం మొదలవుతుందని మంత్రి తెలిపారు. పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులతోనే ప్రారంభం....
ఇప్పటికే ఈ పథకం ద్వారా ఎవరెవరికి కంటి పరీక్షలు నిర్వహించాలి... ప్రాథమికంగా కంటి జబ్బులను ఏ విధంగా గుర్తించాలనే విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో, వైద్య కేంద్రాల్లో చూపు పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేయిస్తారు. జిల్లావ్యాప్తంగా ఏడు లక్షల మంది విద్యార్థులున్నట్లుగా విద్యా, వైద్య ఆరోగ్యశాఖలు సంయుక్తంగా గణాంకాలు తీసుకున్నాయి.
జగన్ రాక ఇలా...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి చేరుకొని, అక్కడినుంచి హెలికాప్టర్ ద్వారా అనంతకు చేరుకుంటారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడినుంచి ఉదయం పదకొండు గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని వేదిక వద్దకు వస్తారు.