హిందూపురం పార్లమెంట్ పరిధిలోని ఓ యువ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఓ పంచాయతీకి తెదేపా మద్దతుదారుడు సర్పంచిగా గెలిచారు. ఈ పంచాయతీలోని మహిళలకు ‘చేయూత’ పథకాన్ని వర్తింపజేయొద్దని ఎమ్మెల్యే హుకుం జారీ చేశారు. దీంతో వాలంటీర్లు మహిళల పేర్లు ‘చేయూత’ పథకంలో నమోదు చేసేందుకు జంకుతున్నారు. పుట్టపర్తి పరిధిలో చాలామంది మహిళల పేర్లు గల్లంతయ్యాయి. రాజకీయ కారణాలతోనే నమోదు చేయలేదంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఈనెల 7న కలెక్టర్ కార్యాలయం ఎదుట మహిళలతో నిరసనకు దిగారు. సమస్యను డీఆర్‌ఓకు విన్నవించారు.
వైఎస్సార్ చేయూత పథకం..
మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన మహిళకు నాలుగు విడతల్లో రూ.75 వేలు సాయం అందించాలని సంకల్పించింది. ఇందులో భాగంగా గతేడాది ఆగస్టులో తొలి విడత రూ.18,750 చొప్పున మహిళల ఖాతాలో జమ చేశారు. తాజాగా రెండో విడత సొమ్ము జమ చేసే ప్రక్రియ మొదలైంది. గతేడాది జాబితా రెన్యువల్, కొత్తగా అర్హుల పేర్ల నమోదుకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియలో ‘రాజకీయ’ జోక్యం పెరిగింది. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న కారణంగా పేర్లు నమోదు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో ఈ ప్రక్రియ నడుస్తోంది. పేర్ల నమోదుకు ఆదివారమే (13వ తేదీ) తుది గడువు. ఇప్పటికే తొలి జాబితాలోని వేలాది మంది పేర్లు గల్లంతయ్యాయి. తొలి విడత నిర్దేశిత మొత్తాన్ని తీసుకున్నాం.. రెండో విడత ఎందుకు రెన్యూవల్ చేయలేదంటూ మహిళలు నిలదీస్తున్నా.. క్షేత్ర స్థాయిలో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. సామాజిక తనిఖీ కోసం సచివాలయాల్లో జాబితాలను ప్రదర్శించలేదు. దీంతో చేయూత పథకం అస్తవ్యస్తంగా మారింది.
షెడ్యూల్ ఇదే..
చేయూత పథకం లబ్ధిదారుల ఎంపిక, రెన్యువల్ ప్రక్రియను గ్రామ/వార్డు వాలంటీర్లకు అప్పగించారు. ఈనెల 3 నుంచి మొదలైంది. 8వ తేదీ దాకా వాలంటీర్లు ఇంటింటా తిరిగి తొలి విడత రెన్యువల్, కొత్త వారిని ఎంపిక చేశారు. అర్హుల జాబితాలను అప్‌లోడ్ చేశారు. వాలంటీర్లు ఆమోదించిన జాబితాలపై గ్రామ, వార్డు సచివాలయ సంక్షేమ సహాయకులు (వెల్ఫేర్ అసిస్టెంటు) పరిశీలిస్తున్నారు. 13వ తేదీ వరకు పరిశీలన ఉంటుంది. అనర్హుల తొలగింపు, కొత్త జాబితా తయారీ, 60 ఏళ్లు పైబడిన వారిని తొలగించడం వంటివి చేస్తున్నారు. 15న సంబంధిత ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ ఈ జాబితాలను ఆమోదించి, ఆయా కార్పొరేషన్లకు పంపిస్తారు. 16న కార్పొరేషన్ల నుంచి కలెక్టర్ ఆమోదానికి వెళ్తాయి.
అర్హులకు చోటు దక్కేనా?
తొలి విడత 2,30,192 మంది అర్హులను గుర్తించారు. తాజాగా వారిలో 60 ఏళ్ల వయసు దాటిందని 30,969 మంది పేర్లు తొలగించారు. మరో 1992 మంది మృతి, శాశ్వత వలసలు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 1,99,223 మందిని ఎంపిక చేశారు. మరోవైపు ఈఏడాది 45 ఏళ్లు నిండిన మహిళలు 41,620 మంది ఉన్నట్లు తేల్చారు. వీరిలోనూ 34,346 మంది పేర్లను జాబితాలోకి ఎక్కించారు. 4,613 మంది పేర్లను నమోదు చేస్తామని, మరో 2,661 మందికి సంబంధించి ఫోన్ నెంబర్లకు ఆధార్ లింకు కాలేదని పేర్కొంటున్నారు. జిల్లాలో 38 వేలకుపైగా అర్హుల పేర్లు జాబితాలో నమోదు చేయలేదని తెలుస్తోంది. రాజకీయ నేతల సూచన మేరకే చాలామంది పేర్లను తొలగించినట్లు విమర్శలు వస్తున్నాయి.
తొలి విడత ఎందరు?
జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు పథకానికి అర్హులు. 45 నుంచి 60 ఏళ్లలోపు వారికి నిర్దేశిత మొత్తాన్ని అందజేస్తారు. ఒక్కో విడతకు రూ.18,750 చొప్పున నాలుగు విడతలు రూ.75 వేలు ఇవ్వనున్నారు. 2020 ఆగస్టులో తొలి విడతగా రూ.18,750 ప్రకారం 2,30,192 మందికి రూ.431.61 కోట్లు మంజూరు చేశారు. ఆయా సామాజిక వర్గాలకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా సొమ్ము అందిస్తున్నారు. గతేడాది ఎస్సీ కార్పొరేషన్ నుంచి 42,003 మందికి రూ.78.75 కోట్లు, ఎస్టీలు 10,229 మందికి రూ.19.17 కోట్లు, బీసీలు 1,43,900 మందికి రూ.269.81 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్‌లో 34,060 మందికి రూ.63.86 కోట్లు అందించారు. ప్రస్తుతం రెండో విడత సొమ్ము ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. ఇక్కడే రాజకీయ జోక్యం తెరపైకి వచ్చింది.
ఎవరికీ అన్యాయం జరగదు..
'చేయూత పథకంలో లబ్ధిదారుల చేరిక, ఎంపిక సాఫీగా సాగుతోంది. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. రెన్యువల్‌లో ఇప్పటికే 99 శాతంపైగా నమోదు చేశాం. కొత్తవారి పేర్లను కూడా ఎక్కించే ప్రక్రియ సాగుతోంది. ఎవరికీ అన్యాయం జరగదు. వాలంటీర్ల వద్ద కాకపోతే.. వెల్ఫేర్ అసిస్టెంటు వద్ద నమోదు చేయించుకోవచ్ఛు అక్కడ కుదరకపోతే మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓల వద్ద కూడా నమోదు చేసుకోవచ్ఛు సర్వర్ ఇబ్బందితో కొంత ఆలస్యం అవుతోంది.'-నరసింహారెడ్డి, పీడీ, డీఆర్‌డీఏ-వైకేపీ
ఇదీ చదవండి: