కరోనాతో వృద్ధురాలు చనిపోయింది... ఆమెను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకొని యువకులు పెద్ద ఎత్తున హల్చల్ చేశారు. మేము బతకాలా వద్దా అంటూ అంబులెన్స్ సిబ్బందిని దుర్భాషలాడారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని అంతిమ సంస్కారాలు సాఫీగా జరిగేటట్లు చూశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రేగాటిపల్లిలో జరిగింది.
అసలు జరిగింది ఇదీ..
అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని ఖననం చేసేందుకు రేగాటిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న స్థలాన్ని అధికారులు ఎంపిక చేశారు. తమ ప్రాంతంలో కరోనా మృతురాలిని ఖననం చేయటానికి వీళ్లేదంటూ రేగాటిపల్లి యువకులు ఆందోళనకు దిగారు. ఈ ప్రాంతానికి మృతదేహాన్ని ఎందుకు తీసుకువచ్చారంటూ, అనుమతి ఇచ్చిన అధికారులు ఎవరంటూ అంబులెన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకులను అక్కడ నుంచి చెదరగొట్టారు. అనంతరం వృద్ధురాలి మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య ఖననం చేశారు.
ఇదీ చదవండి: నూనె మిల్లులో భారీ అగ్ని ప్రమాదం