YCP Leaders Illegal Moving of Soil: అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. కణేకల్ మండలం గేనిగెర వద్ద హెచ్ఎల్సీ మట్టిని టిప్పర్లతో తరలిస్తున్నారు. పగటిపూట తరలిస్తే ఇబ్బంది వస్తుందని.. రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా దోపిడీ చేస్తున్నారు. కణేకల్ క్రాస్, ఎర్రగుంట ప్రాంతాల్లో అక్రమ లేఔట్ల కోసం ఈ మట్టిని తీసుకుపోతున్నారు. ప్రజాప్రతినిధుల అండతో పెద్దసంఖ్యలో టిప్పర్లను తిప్పుతూ దందా చేస్తున్నారు.
పూలచర్ల సమీపంలోని కొండనూ అక్రమార్కులు ధ్వంసం చేస్తున్నారు. 20 అడుగులకు పైగా మట్టిని యంత్రాలతో తవ్వేశారు. ఈ మట్టిని రాయదుర్గంలోని శ్రీ ఆంజనేయస్వామి లేఔట్‌కు తరలించారు. గౌడ లేఔట్ వద్దనున్న కొండను తవ్వడంతో.. 25 అడుగుల మేర గుంతలు పడ్డాయి. బాలికల జూనియర్ కళాశాల, అడుగుప్ప రోడ్డు, వీరాపురం, బీ.ఎన్.హళ్లి, బొమ్మక్కపల్లి, టి.వీరాపురం ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వ్యవసాయ భూములతో పాటు కొండ ప్రాంతాలను చదును చేసి ఇళ్ల ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.
అధికార పార్టీ నేతల అండతో అక్రమార్కులు ప్రకృతి వనరులను దోచుకుంటున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. దోపిడీదారులపై చర్యలు తీసుకోకుంటే మిగిలిన కాలువను మింగేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మట్టి తవ్వకాలపై కణేకల్ డివిజన్ హెచ్ఎల్సీ డీఈఈ గోపాల్ నాయక్, తహశీల్దార్ రజాక్ సాహెబ్‌ను ఈటీవీ, ఈనాడు సంప్రదించగా.. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొండను పరిరక్షించేందుకు రెవెన్యూ సిబ్బందిని కాపలా పెడతామని చెప్పారు.
ఇవీ చదవండి: