అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలోని ఇండియన్ డిజైన్స్, కాలువపల్లి వద్ద ఉన్న నిషా డిజైన్స్ గార్మెంట్స్ మహిళా కార్మికులు చేపట్టిన నిరసన రెండోరోజుకు చేరింది. హిందూపురం-మడకశిర ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీగా మోహరించారు. తమ సమస్యలను ఫ్యాక్టరీ యాజమాన్యం పరిష్కరించేంతవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టంచేశారు.
పెనుగొండ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని శాంతియుతంగా నిరసన చేయాలని సూచించారు. దీంతో శాంతించిన మహిళలు వాహనాల రాకపోకలకు దారి వదిలారు. ఏపీ ప్రభుత్వ కార్మిక చట్టం ప్రకారం వేతనాలు ఇస్తున్నామని ఇండియన్ గార్మెంట్స్ జనరల్ మేనేజర్ తెలిపారు. అయినా అదనంగా ఇవ్వాలంటూ కార్మికులు అడుగుతున్నారన్నారు. యాజమాన్యంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.