అనంతపురం జిల్లా గొల్లపల్లి జలాశయం నుంచి హంద్రీనీవా కాలువ ద్వారా.... కృష్ణా జలాలను పేరూరు డ్యామ్‌కు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రొద్దం మండలంలోని చెరువులు నింపుతూ పెన్నా నది నుంచి పేరూరు డ్యాంకు నీరు చేరాల్సి ఉంది.
2 రోజుల క్రితం గొల్లపల్లి జలాశయం నుంచి నీటి విడుదల నిలిపివేశారు. పెద్ద కోడిపల్లి చెరువులో నిండిన కృష్ణా జలాలను... చెరువు కట్ట తెంపి పేరూరు డ్యామ్‌కు పంపించాలని.... బుధవారం సాయంత్రం అధికారులంతా చెరువు వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు... వారిని అడ్డుకోగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలకి నచ్చచెప్పారు. అయితే గ్రామస్థులు మాత్రం కట్ట తెంపుతారేమోననే భయంతో అక్కడే కాపలా కాస్తున్నారు.
చెరువు కట్ట కింద 1000 ఎకరాల ఆయకట్టు ఉందని, ప్రస్తుతం చెరువులో 10 లక్షల చేప పిల్లలు పెంచుతున్నామని.. ఇలాంటి సమయంలో చెరువు కట్ట తెంపడం సరి కాదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తమ చెరువుకట్టకు ఎలాంటి ముప్పు లేకుండా చూడాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు: సీఎం జగన్