అనంతపురం జిల్లా తలుపుల మండలం గొల్లపల్లి తండావాసులు ఆందోళనకు దిగారు. కదిరి-పులివెందుల ప్రధాన రహదారిపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వారం రోజులుగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా అప్పటినుంచి తాగునీటి సరఫరా కూడా ఆగిపోయింది. సమస్యను గ్రామస్థాయి అధికారి నుంచి రాష్ట్రస్థాయి అధికారి వరకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ గొల్లపల్లి తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు. ఈనెల 3వ తేదీన కురిసిన భారీ వర్షాల ధాటికి ప్రధాన రహదారి కోతకు గురై అంతరాయం ఏర్పడింది.
అప్పటినుంచి గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. అలాగే విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఫలితంగా వర్షాకాలంలో దోమల ఉద్ధృతి పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు. విద్యుత్ సరఫరా కూడా లేకపోవడంతో మూడో తేదీ నుంచి ఇప్పటివరకు తాగునీటి సరఫరా ఆగిపోయిందని.. ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: పోలవరం పంట కాల్వలో పడి వ్యక్తి గల్లంతు