అనంతపురం జిల్లాలో ఈరోజు 2 వేర్వేరు ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగాయి. కదిరి వైపు నుంచి చిత్తూరు జిల్లా ములకలచెరువుకి వెళ్తున్న కారు గంగసాని పల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో తండ్రీకొడుకులు నాగరాజు, జనిత్ గాయపడ్డారు. కుమారుడు కారులో ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న తనకల్లు పోలీసులు, స్థానికుల సహకారంతో బాలుడిని బయటకు తీశారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
నల్లచెరువు మండలం రాట్నాలపల్లి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కదిరి నుంచి మదనపల్లి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ముందు వెళుతున్న బస్సును అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న కంటైనరను ఢీకొంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాలు 2 వేగంగా వెళుతుండటంతో రెండు బాగా దెబ్బతిన్నాయి. రెండు ప్రమాదాల్లో వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో గాయపడ్డ వారి కుటుంబసభ్యులు ఊపిరి పిల్చుకున్నారు.