Two Persons Arrested for Conducting Gender Determination Tests: లింగనిర్ధారణ చేయడం నేరమని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అవగాహన కల్పిస్తున్నా.. నివారించడంలో మాత్రం ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోంది. అనంతపురం నగరంలో ఓ ఇంట్లో గత సెప్టెంబరు నుంచి ఏకంగా 128 లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఒక్కో పరీక్షకు 7 వేల రూపాయలు వసూలు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. దీనిపై సీపీఎం నాయకులు అధికారులకు ఫిర్యాదు చేయగా.. అక్కడకు వెళ్లిన అధికారులు ఈ దందాను చూసి నిర్ఘాంతపోయారు.
జిల్లా కేంద్రంలోనే లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నా ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోలేదనడానికి ఈ ఘటనే నిదర్శనం. కొంతమంది వైద్యులు, కొన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు డబ్బులకు కక్కుర్తి పడి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంటోనే స్కానింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొంత మంది ఆడబిడ్డ అని తెలియగానే.. ప్రైవేట్ హాస్పటల్స్‌లో రహస్యంగా అబార్షన్లు చేయిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
అనంతపురం రెవెన్యూ కాలనీలోని లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ సునీల్, శ్రావణి అనే వ్యక్తులు దొరికిపోయారు. ఇంటిని అద్దెకు తీసుకుని సునీల్ నివాసం ఉంటున్నాడు. అతని భార్య నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. భార్య కాలేజ్‌కి, కొడుకు స్కూల్‌కు వెళ్లగానే.. సునీల్ ఇంట్లో ఏర్పాటు చేసిన స్కానింగ్ యంత్రంతో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాడు. ఈయనకు కర్నూలుకు చెందిన యువతి శ్రావణి సహకరిస్తోంది. ఈమె బీ పార్మసీ పూర్తి చేసి ఉద్యోగం వెతికే పనిలో సునీల్‌ను సంప్రదించగా నెలకు 30 వేల రూపాయలు జీతం ఇస్తానని అతని వద్ద పనిలో పెట్టుకున్నాడు. ఆమె నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది.
Women Delivery On Road : ఆస్పత్రిలో చేర్చుకోని సిబ్బంది.. నడిరోడ్డుపై రిక్షాలోనే గర్భిణీ ప్రసవం
సునీల్ తరచూ రైల్వేస్టేషన్ సమీపంలోని ఒక ప్రైవేట్ వైద్యశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని రెండు ఆసుపత్రులు, సంగమేశ్‌నగర్ సర్కిల్, విద్యుత్తునగర్ సమీపంలో ఉన్న ఆసుపత్రుల వద్ద నుంచి గర్భిణులను తీసుకెళ్తుండటాన్ని సీపీఎం నాయకులు గుర్తించారు. అనుమానం కలిగి వారు కొన్ని రోజులుగా అతనిపై నిఘా ఉంచారు. మూడో పట్టణ పోలీసులకు, తహసీల్దార్, డీఎంహెచ్‌వోకు ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, నాయకులు వలి, ఇస్మాయిల్, వెంకటేశ్, జీవాలు ఫిర్యాదు చేశారు.
తక్షణమే స్పందించిన డీఎంహెచ్‌వో ఈబీ దేవి, డిప్యూటీ తహసీల్దార్ దుర్గాప్రసాద్, వీఆర్‌వో నాగలక్ష్మితోపాటు పోలీసులు.. నాయకులతో కలిసి ఆ ఇంటికి వెళ్లి తనిఖీ చేశారు. సునీల్‌కుమార్, శ్రావణిలను పోలీసులు అదుపులోకి తీసుకుని, స్కానింగ్ యంత్రం, రెండు సెల్‌ఫోన్లు, స్కానింగ్ చేయించుకున్న గర్భిణుల వివరాలను స్వాధీనం చేసుకున్నారు.