జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో నిలిచిపోయిన మురుగునీరు
జిల్లాను కరోనా వైరస్ బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. మరోవైపు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాలు పొంచి ఉన్నాయి. జ్వరం వస్తే చాలు ప్రజల్లో భయాందోళన పెరిగిపోతోంది. వైద్యానికి ఆసుపత్రులకు వెళ్తే చికిత్స అందడం గగనమవుతోంది. విష జ్వరాలకు మూలకారణం దోమలు వృద్ధి చెందడమే. ఇప్పటికే స్థానిక, జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయినా అధికారులు మేల్కోవడం లేదు. మున్సిపల్ అధికారులు దోమల నిర్మూలనకు కనీసం ఫాగింగ్ చేయించడం లేదు.
చేపట్టాల్సిన చర్యలివీ..
● క్రమం తప్పకుండా ఫాగింగ్ చేయాలి.
● లార్వా వృద్ధి చెందకుండా స్ప్రేయింగ్ చేయాలి.
● అపరిశుభ్ర ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలి.
● ఎప్పటికప్పుడు డ్రైనేజీల్లో పూడిక తీయించాలి.
● వంకల్లో చెట్లను తొలగించాలి.
● మురుగు సక్రమంగా పారేలా చూడాలి.
- పురపాలికలు 12
- జనాభా: 10 లక్షలకుపైగా
- దోమల నిర్మూలనకు నిధులు: ఏడాదికి రూ.25 లక్షలు
కానరాని ముందస్తు చర్యలు
ఏటా జూన్ ఆరంభంలో జిల్లాలో వర్షాలు కురుస్తాయి. అప్పటినుంచే దోమల నివారణకు చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆగస్టు సగం గడిచిపోతున్నా ఇప్పటికీ చలనం లేదు. జూన్ రాకముందే కాలువలు, డ్రైనేజీలు, వంకల్లోని పూడిక తొలగించి, మురుగు పారడానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఎక్కడా ఇలాంటివి జరగలేదు. దీంతో మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. మురుగు నీరే దోమలకు ఆవాసంగా మారుతోంది. దోమలు పట్టణ వాసుల రక్తాన్ని తాగేస్తున్నాయి. విష జ్వరాలు తెచ్చిపెడుతున్నాయి.
రాయదుర్గంలోనూ అంతే
రాయదుర్గంలో ఐదు ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. వాటిలో నాలుగు చెడిపోయాయి. ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. దానికున్న సామర్థ్యంతో రోజుకు ఒక వార్డుకు మాత్రమే పిచికారీ చేయడానికి వీలుంది. ఈలెక్కన ఒక్కో వార్డుకు పిచికారీ చేయాలంటే కనీసం 20 రోజులు ఆగాల్సి వస్తోంది.
తాడిపత్రిలో అధ్వానం
తాడిపత్రిలో 5 ఫాగింగ్ యంత్రాలు ఉండగా.. ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. యంత్రాలు సరిపడినన్ని అందుబాటులో లేక ఫాగింగ్, స్ప్రేయింగ్ జరగడం లేదు. ఆదర్శ మున్సిపాలిటీగా పురస్కారాలు అందుకున్న తాడిపత్రి అధికారుల్లోనూ చలనం లేదు. పట్టణ శివారు కాలనీల్లో పరిస్థితి మరీ దయనీయంగా మారింది. మురుగునీరు ఎక్కడికక్కడే నిల్వ చేరింది.
యంత్రాలున్నా.. ఉపయోగం లేదు
హిందూపురంలో 20 చిన్న ఫాగింగ్ యంత్రాలను కొనుగోలు చేసి వార్డు సచివాలయాలకు పంపిణీ చేశారు. అయితే ఒక్క యంత్రాన్ని కూడా వినియోగంలోకి తీసుకురాకపోవడం గమనార్హం. అవన్నీ నిరుపయోగంగా మూలన పడి ఉన్నాయి. పెద్ద ఫాగింగ్ యంత్రం మరమ్మతులకు గురై నెలలు గడుస్తున్నా బాగు చేయించలేకపోయారు. ప్రజలంతా జ్వరాల బారిన పడుతున్నా మున్సిపల్ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.
ప్రణాళికేదీ..?
నగరంలో సుమారు 3 లక్షల జనాభా నివసిస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన జిల్లా కేంద్రంలోనే పరిస్థితి దయనీయంగా మారింది. కాలువలన్నీ వ్యర్థాలతో నిండిపోవడంతో మురుగు పారేందుకు అవకాశం లేకుండా పోయింది. నగరవాసులు పన్నుల రూపంలో ఏటా రూ.25 కోట్లు నగరపాలికకు చెల్లిస్తున్నారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ నిధులను ఖర్చు చేయాలి. కానీ కరోనా కట్టడి పేరుచెప్పి దోమల నిర్మూలనపై కనీసం దృష్టి పెట్టడం లేదు. ఫాగింగ్ కోసం 3 పెద్దవి, 6 చిన్న యంత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 3 చిన్న యంత్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటితో 50 వార్డులకు ఎలా ఫాగింగ్ చేయవచ్చో అధికారులే చెప్పాలి. ఫాగింగ్, స్ప్రేయింగ్‌కి 100 రోజుల ప్రణాళికతో టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఆ దిశగా కనీసం ఆలోచించిన దాఖలాలు లేవు.
ఆదేశాలు జారీ చేస్తాం
ప్రస్తుత పరిస్థితుల్లో స్ప్రేయింగ్, ఫాగింగ్ చేయడం, బ్లీచింగ్ చల్లడం అత్యవసరం. లేదంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంది. కొన్నిచోట్ల జరగడం లేదని నా దృష్టికి వచ్చింది. కొన్ని ఫాగింగ్ యంత్రాలు మరమ్మతులకు గురయ్యాయి. వీలైనంత త్వరగా వాటిని బాగు చేయిస్తాం. జిల్లాలోని అన్ని పట్టణాల్లోనూ ఫాగింగ్, స్ప్రేయింగ్ క్రమం తప్పకుండా చేయించడానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. - నాగరాజు, పురపాలక శాఖ ప్రాంతీయ సంచాలకులు
ఫాగింగ్ యంత్రం
ఇవీ చదవండి