355 పంచాయతీలకు..
అనంత రెవెన్యూ డివిజన్ పరిధిలోని 19 మండలాల్లో 381 పంచాయతీలు, 3,736 వార్డులు ఉన్నాయి. 23 సర్పంచి స్థానాలు, 1,076 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అనంత గ్రామీణ మండలం నారాయణపురం, పాపంపేట పంచాయతీల వివాదం కోర్డులో ఉండటంతో అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు. అలాగే పెదవడుగూరు మండలం రావులుడికి పంచాయతీకి సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వ్యక్తి మరణించడంతో ఓటింగ్ వాయిదా వేశారు. దీంతో 355 పంచాయతీలకు, 2619 వార్డులకు ఎన్నికలు జరిగాయి.
పెద్దపప్పూరులో అధికం
19 మండలాల్లో 80.29 శాతం ఓటింగ్ నమోదైంది. రెండో విడతతో పోలిస్తే 4 శాతం తగ్గింది. అన్ని మండలాల్లో పోలింగ్ సరళిని పరిశీలిస్తే.. పెద్దపప్పూరు మండలంలో అత్యధికంగా 88 శాతం, అత్యల్పంగా అనంత గ్రామీణ మండలంలో 68.90 శాతం ఓటింగ్ నమోదైంది. గుత్తి, ఆత్మకూరు, కూడేరు, గుంతకల్లు, పామిడి, పెద్దవడుగూరు, పుట్లూరు, వజ్రకరూరు, విడపనకల్లు, యల్లనూరు, శింగనమల మండలాల్లో ఓటింగ్ 80 శాతానికి పైగా నమోదైంది.
ఓటేసిన మంగ్లి
ప్రముఖ నేపథ్య గాయని మంగ్లి బుధవారం గుత్తి మండలం బసినేపల్లి తండాలో పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేశారు. ఆమె హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వార్డు పోలింగ్ వాయిదా
ఉరవకొండలోని మూడో వార్డు పోలింగును వాయిదా వేస్తూ ఎన్నికల అధికారులు మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వార్డుకు షబానా అనే అభ్యర్థిని నామపత్రాన్ని దాఖలు చేశారు. అనంతరం వెనక్కి తీసుకున్నా.. ఆమె పోటీలో ఉన్నట్లుగా బ్యాలెట్ పత్రంలో గుర్తును కేటాయించారు. ఈ అంశంపై 13న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘ఉపసంహరించుకున్నా... గుర్తుంచుకున్నారు’ కథనానికి ఎన్నికల అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో విచారణ చేయించి, పోలింగును వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వార్డుకు ఈనెల 21న ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఇక్కడ సర్పంచి ఎన్నికను యథావిధిగా కొనసాగించారు.
కదిలిన పల్లెలు
మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారు పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టే వరకు అభ్యర్థుల మద్దతుదారులు ఓటు రాబట్టేందుకు నానా ప్రయోగాలు చేశారు. వంగి వంగి దండాలు పెడుతూ మరి ఓటు అభ్యర్థించారు. కూడేరు మండల కేంద్రానికి చెందిన మహిళా కూలీలు పోలింగ్ మొదలవగానే ఓటు వేసి.. పొలాల్లో నాటువేయడానికి బయల్దేరి వెళ్లారు.
ఇదీ చూడండి. పంచాయతీ పోరు: ముగిసిన మూడో విడత పోలింగ్