రైలు ఇంజన్లో దొంగలు పడ్డారు. అవును మీరు చదివింది నిజమే. ఇప్పటి వరకూ.. ఇళ్లలో, బయట వస్తువులు దొంగతనాలు చేయడం.. బస్సులు, రైళ్లలో చోరీలు, రహదారుల్లో వాహనాలు ఆపి చోరీలు చేసి దోచుకునే వారిని చూసే ఉంటాం. కానీ వీరు కాస్త భిన్నం అన్నమాట. ఇంతకీ ఈ చోరీ ఎక్కడ? ఏంటో? తెలుసుకోండి మరి.
అనంతపురం జిల్లా గూళ్లపాళ్యం రైల్వే స్టేషన్లో స్క్రాప్ రైలు ఇంజన్ లో దొంగలు పడ్డారు. అందులోని సామాగ్రిని దోచుకెళ్లారు. కాలం చెల్లిన రైలు ఇంజన్ లను అధికారులు స్క్రాప్ కింద పరిగణించి అమ్మి వేసేందుకు గుంతకల్లు స్టేషన్ కు 10 కి.మీ. దూరంలోని గూళ్లపాళ్యం స్టేషన్ వద్ద పక్కన పెట్టారు. కాలం చెల్లినటువంటి 14 ట్రైన్ నెంబర్ తో మొదలయ్యే ఐదు రైలు ఇంజన్లను ఈ స్టేషన్ వద్ద పెట్టారు. దీనిని గమనించిన కొందరు దుండగులు సమయం చూసి అందులోని లక్షలాది రూపాయల కాపర్, ఇనుప సామాగ్రిని ఎత్తుకెళ్లారు. ఐతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రైల్వే అధికారులు ఆర్.పి.ఎఫ్ పోలీస్ లు, ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
రైలు ఇంజిన్ లో ఏ సామాగ్రి చోరీ అయ్యింది అన్నది నిర్ధారించిన అనంతరం ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఏకంగా రైలు ఇంజిన్ లోని వస్తువులే చోరీ కావడం చర్చనీయాంశంగా మారింది. రైలు నెంబర్ 14 తో మొదలయ్యే ఇంజన్లను భారతీయ రైల్వే.. కాలం చెల్లినవిగా పరగణించి వాటిని వేలంవేసి స్క్రాప్ కింద అమ్మకానికి పెడుతుంటారు. గుంతకల్లు రైల్వే స్టేషన్ లో తగినంత స్థలం లేకపోవడంతో అధికారులు ఔటర్ స్టేషన్లోని గూళ్లపాళ్యం వద్ద ఉంచారు.
ఇలాంటి రైళ్లు గతంలో వేలం నిర్వహించగా ఒక్కో రైలు ఇంజిన్ 80 నుంచి 90 లక్షల ధర పలికినట్లు రైల్వేలో పనిచేసే స్థానిక కార్మికులు తెలిపారు. ఇంత విలువైన సామాగ్రిని రైల్వే స్టేషన్ కు దూరంగా ఉంచడం, వాటికి భద్రత, రక్షణ కల్పించకపోవడం వల్లే ఇలా దోపిడీలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి పెట్టి ఆరునెలల కాలం అవుతోందని.. వీటిని పెట్టకముందే ఇందులో విలువైన సామాన్లు దోపిడీ చేసి పెట్టారా? లేక దొంగలు ఎత్తుకెళ్లారా? అన్న కోణంలోనూ.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇదీ చదవండి : ఏలూరు వైకాపా నేత హత్యకేసు నిందితుడు..