ఆయనో మాజీ సైనికుడు. పొలాలకు దారి కోసం గ్రామస్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తనవంతు సాయం అందించారు. పనులు పూర్తవటంతో ఆయనతోనే ప్రారంభింపజేశారు. అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని యర్లంపల్లి, కొత్తకోట, అగ్రహారం గ్రామాలకు చెందిన రైతుల భూములు అటవీప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. చెరువులో నుంచి కాలినడకనే అక్కడికి చేరుకోవాలి.
నీరు చేరితే కొండచుట్టూ తిరిగి 20 కి.మీ. మేర వెళ్లాలి. ఏళ్లుగా గ్రామస్థులు అధికారులకు, పాలకులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. తామే స్వయంగా రోడ్డు వేసుకోవాలని గ్రామస్థులు నిశ్చయించుకున్నారు. తలాకొంత వేసుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామానికి చెందిన యువకులు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో బెంగళూరుకు చెందిన మాజీ సైనికుడు టి.వి.మురళి స్పందించి గ్రామానికి వచ్చి పరిశీలించారు.
బెంగళూరులో సైకిల్‌యాత్ర ప్రారంభించి విరాళాలు సేకరించి రూ. 50 వేల వరకు అందించారు. అందరి సహకారంతో సుమారు 5 కిలోమీటర్ల మేర బండరాళ్లు తొలగించి రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఆదివారం మాజీ సైనికుడితో ప్రారంభింపచేశారు. ఆయన్ను సత్కరించారు. దూరం తగ్గి రాకపోకలకు మార్గం సుగమమైందని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఏదో ఒక మారుమూల ప్రాంతాన్ని ఎంచుకుని సాయం చేస్తున్నట్లు మురళి తెలిపారు.
ఇదీ చదవండి: