JEE Mains 2023 Results released: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన జేఈఈ-2023 మెయిన్ తొలి విడత ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయ ఢంకా మోగించారు. ఎన్టీఏ విడుదల చేసిన పేపర్ -1 (బీఈ/బీటెక్) ఫలితాల్లో టాప్ -20 విద్యార్థుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులే ఐదుగురు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా.. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి, దుగ్గినేని వెంకట యుగేశ్, గుత్తికొండ అభిరామ్, బిక్కిన అభినవ్ చౌదరి, అభినీత్ మాజేటి నిలిచి తమ సత్తాను చాటుకున్నారు.
ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షలు రాసేందుకు దేశ వ్యాప్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి 12వరకు జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. తొలి విడత రాసిన విద్యార్థులు.. రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష తర్వాత ఎన్టీఏ ఆల్ ఇండియా ర్యాంకుల్ని ప్రకటిస్తుంది. ఆ తర్వాత విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రవేశాల ప్రక్రియను చేపట్టనున్నారు.
20 మందికి 100 పర్సంటైల్.. టాపర్ల జాబితా ఇదే..
ఫలితాలు విడుదల: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎన్టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ https://jeemain.nta.nic.in/లో ఫలితాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు వివిధ తేదీల్లో జరిగిన జేఈఈ మెయిన్- 2023 తొలి విడత పరీక్షను 8.22లక్షల మంది రాశారు.
రెండో సెషన్ రిజిస్ట్రేషన్ అప్పుడే.. సోమవారం తుది 'కీ'ని విడుదల చేసిన ఎన్టీఏ.. కొద్ది గంటల వ్యవధిలోనే ఫలితాలనూ వెల్లడించింది. మరోవైపు, జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12వరకు జరగనున్నాయి. రెండో విడత పరీక్షలకు హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరగనున్నాయి.
ఇవీ చదవండి: