Dhobi Ghat Land Kabja: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం ఆకుతోటపల్లి సమీపంలో సుమారు 50 రజక కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 1984లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు.. వీరికి బట్టలు ఉతికి ఆరబెట్టుకునేందుకు దోభీ ఘాట్ కోసం 5 ఎకరాలు కేటాయించారు. అందులోనే ఓ బోరు ఏర్పాటు చేసి ఇచ్చారు. ఈ స్థలంలో కొంత భాగాన్ని శ్మశానికి ఇవ్వాలని అప్పట్లో పంచాయతీలో తీర్మానించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్థలాన్ని ఆర్మీ ఉద్యోగులకు కేటాయించాలంటూ 1994లో కొంతమంది వచ్చారని.. ఆక్రమించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు తెలిపారు. తర్వాత 2015వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా దోభీ ఘాట్‌ను నిర్వహించుకుంటున్నట్లు వెల్లడించారు.
2017లో దీనిని ఆనుకునే శిల్పాలేపాక్షి నగర్ అభివృద్ధి చెందడంతో చుట్టుపక్కల భూముల విలువ అమాంతం పెరిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక స్థలాన్ని ఆక్రమించేందుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారులు పావులు కదిపారు. ఆకుతోటపల్లికి చెందిన ఓ ఉపాధ్యాయుడు స్థిరాస్థి రంగంలో ఉన్నారు. దోభీ ఘాట్ స్థలాన్ని ఆర్మీ అధికారులకు విక్రయించారని.. వారి నుంచి తాను కొన్నానని ఆయన చెబుతున్నారు. ఐదెకరాల్లో లేఅవుట్ వేశారు. పాత బోరుతో పాటు ఏడాది కిందట రజకులు వేసుకున్న కొత్త బోరును సైతం తొలగించారు. పక్కనున్న ఎర్రవంక స్థలం 50 సెంట్లూ కలిపేసుకున్నారు.
"ఆకుతోటపల్లి ..దోభీ ఘాట్‌ను ఆక్రమించుకున్నారు.. మేము ఎక్కడికి పోయి ఉతకాలి సార్.. అంతా ఆక్రమించటం వల్ల మాకు బట్టలు ఆరేసేందుకు ప్రదేశం లేదు, ఉతికుండేకి లేదు.. ఇళ్ల దగ్గరే బట్టలు ఉతుకుతున్నాము.. అదేంటంటే మీరేమైనా బట్టలు ఉతుకుతున్నారని అని చెప్పి..బట్టలు ఆరేసుకుని వైర్లు పీక్కుని పోతున్నారు.." ఆదిలక్ష్మి రజకు మహిళ
అదేమని రజకులు ప్రశ్నిస్తే దోభీ ఘాట్‌కు 10 సెంట్లు ఇస్తామని చెబుతున్నారు. గంధం చంద్రుడు కలెక్టర్‌గా ఉండగా తమ సమస్యను మొరపెట్టుకోగా సర్వేచేసి హద్దులు నిర్ణయించారని బాధిత రజకులు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు తమను పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. ఆక్రమణపై తహశీల్దార్ శ్రీధర్‌మూర్తిని ప్రశ్నించగా.. ఇంకా తమ దృష్టికి రాలేదని, విచారిస్తామని చెప్పుకొచ్చారు.
"ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో మాకు అందరికీ రజకులకు, ఊరి ఊరికి ఎక్కడెక్కడున్న ప్రతీ ఒక్క ఊరిలో ధోబి ఖాన్ ఇవ్వడం జరిగింది.. అప్పటి నుంచి మేము కుల వృత్తి చేసుకుంటూ ఉన్నాము కానీ, కొద్ది రోజులగా ఇక్కడ మాకు ధోబి ఖాన్ లేకుండా..ఖబ్జా చేసి, ప్లాట్లు వేసి, మేము వేసుకున్న మోటారును, గవర్నమెంటు మోటారును ద్వంసం చేసి మాకు ఇబ్బంది పెడుతున్నారు.." ఆంజనేయులు రజకుడు
ఇవీ చదవండి: